
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తుది విడత బిల్లుల విడుదలకు ఉన్న నిబంధనల్లో కొన్నిమార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, త్వరగా గృహ ప్రవేశాలు చేసేందుకు వీలుగా ఈ మేరకు కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఇంటి నిర్మాణపు పనులు సమగ్రంగా పూర్తయిన తరువాతనే క్షేత్ర స్థాయి సిబ్బంది ఫొటోలను అప్‌లోడ్ చేసి తుది బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాలని గతంలో నిర్ధేశించగా, లబ్దిదారులు తాము నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశం చేసుకున్న తరువాత కూడా కొన్ని పనులను చేపట్టేందుకు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఇళ్లలో నివసించేందుకు అనువైన వసతులు, పరిస్థితులుంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయి నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ, చిన్న పనులు కాకపోవడంతో బిల్లుల విడుదల కాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సూచనలు, లబ్ధిదారుల ఇబ్బందులు మొదలైన అంశాలపై నిశితంగా అధ్యయనం చేసిన తరువాత కొన్ని అంశాల్లో సడలింపు ఇస్తున్నట్లు ఎండి పేర్కొన్నారు. అందులో ప్రధానంగా లోపలి వైపు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, తలుపులు(దర్వాజాలు), పూర్తి స్థాయి విద్యుత్ వైరింగ్, ప్లబింగ్ వంటి పనులను లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకున్న తరువాత వీలును బట్టి పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ సడలింపుల వల్ల ఇందిరమ్మ లబ్దిదారులకు తుదివిడత బిల్లు రూపేణా చెల్లించాల్సిన మొత్తం విడుదలై, వారికి ఆర్ధికంగా వెసులు బాటు కలుగుతుందని ఆయన వివరించారు. ఈ మేరకు, సవరించిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి బిల్లుల ప్రతిపాదనలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎండి ఆదేశించారు.
కొత్త మార్గదర్శకాలు ఇలా…
కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టరింగ్ ఇంటి వెలుపలి వైపు పూర్తి కావాలి.(లోపలి వైపు ప్లాస్టరింగ్ గృహ ప్రవేశం తరువాత కూడా చేసుకోవచ్చు.) ఫ్లోరింగ్ తప్పనిసరి కాదు (ఆయా లబ్దిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి ఫ్లోరింగ్ చేసుకునే వెసులుబాటు) కల్పించారు. కలరింగ్ – వెలుపలి భాగంలో చేయాల్సి ఉంటుంది. (రెండో కోట్ కలరింగ్‌ను ఇంటిలో నివసిస్తూ, వినియోగిస్తూ కూడా చేసుకోవచ్చు). ఇంటి వెలుపలి దర్వాజాలు ఏర్పాటు చేసుకోవాలి. (లోపలి వైపునవి ఇంటిలో నివసిస్తూ కూడా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు), విద్యుత్ వైరింగ్ తుది బిల్లు విడుదలకు తప్పనిసరి కాదు. (వైరింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ పాత ఇంటి కనెక్షన్ ద్వారా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు). ప్లంబింగ్ – పనులు ఇంటిలో నివసిస్తూ చేసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది విడత బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం ఉత్తర్వులు జారీ చేశారు.