
వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం; పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు నేటి నేతల విషయం లో అక్షర సత్యాలు. తాము ప్రజాప్రతినిధులమన్న మాట మరిచి వారు ప్రవర్తించే తీరు మాట్లాడే మాటలు సభ్యసమాజానికి తల వంపులు కలిగిస్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత తప్పు ఒప్పుకున్నా, క్షమాపణలు కోరినా ప్రయోజనం శూన్యం. జరగవలసిన నష్టం ఆపాటికి జరిగే ఉంటుంది. విచక్షణ మరిచి చేస్తున్న పనులు వారి పార్టీల సంగతి పక్కన పెడితే వారిని ఎన్నుకున్న ప్రజలను మాత్రం ఆత్మరక్షణలో పడేస్తున్నాయన్నది నిజం. గతవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక మాజీ ఎంఎల్‌ఎ, ఒక ప్రస్తుత ఎంపి రియాల్టర్లు వ్యాపారవేత్తలు కలిసి పార్టీ చేసుకోవడం జరిగింది. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీలో కొకైన్, ఇంకా ఇతర నిషేధిత మత్తుపదార్థాలు వినియోగించబడ్డాయని వారిపై జరిపిన పరీక్షల్లో బయటపడింది.
ఈ సందర్భంగా 11 మంది అరెస్టు కాగా, అందులో ఆరుగురు పరీక్షలలో పాజిటివ్‌గా తేలారు. అంతేకాదు పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపిన ప్రయత్నంలో లోపల నుండి కాల్పులు కూడా జరిగాయి. కాల్పులు జరపండి, ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అన్న మాటలు కూడా వినపడ్డట్టు చదివాం. మాదకద్రవ్యాల వాడకం ఒక తప్పు. కాల్పులు జరపడం మరొక తప్పు. కాల్పుల విషయం తాను చూసుకుంటానని ఒక వ్యక్తి అనడం ఇంకొక తప్పు. ఎన్ని తప్పులు? ఇవన్నీ కాక ప్రజాప్రతినిధులు మాదకద్రవ్యాలతోకూడిన పార్టీ జరుపుకోవడం అందులో వ్యాపారవేత్తలు కూడా ఉండడం అంటే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో అంటకాగుతున్నారని స్పష్టమవుతున్నది. తుంగతుర్తి ఎంఎల్‌ఎ బ్రాహ్మణులను, వారు చదివే మంత్రాలను కించపరిచే విధంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒక ఎంఎల్‌ఎ. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు.
లక్షన్నర రెండు లక్షల మంది ఓటర్లకు 3 లక్షల ప్రజలకు ఆయన ప్రజాప్రతినిధి. ఎంతో నమ్మకంతో వారు ఆయనను తమ నియోజకవర్గ శాసనసభ్యుడుగా ఎన్నుకున్నారు. అందులో అన్నివర్గాల వారు ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున ఎన్నికైనవాడు. కానీ తన స్థాయిని మరచి లేదా సమాజంలోని ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సభ్యసమాజం తప్పక ఖండించవలసిన విషయం. విమర్శించబడిన వారిలో తనకు లేదా తన పార్టీకి ఓట్లు వేసిన వారు కూడా ఉండడం సహజమే. సహజంగానే చాలామంది ఆయన వ్యాఖ్యలను వైఖరిని ఖండించారు. ఇక బిజెపి ఎంపి కేంద్రమంత్రి మరో అడుగు ముందుకేసి ఈ విషయాన్ని రచ్చచేయగా, బిజెపి అభిమానులు సదరు ఎంఎల్‌ఎ ఇంటిపైన దాడి కూడా చేశారు. మొత్తం మీద తప్పు తెలుసుకున్నాడు లేక జరుగుతున్న వివాదానికి చరమగీతం పాడుదాం అనుకున్నాడు.
అందుకే ఆ ఎంఎల్‌ఎ క్షమాపణ చెప్పడం జరిగింది. తాత్కాలికంగా సద్దుమణిగినా ఆ వ్యాఖ్యలు సమాజంలోని ఒక వర్గం వారి మనోభావాలను దెబ్బతీశాయి అనడంలో సందేహం లేదు. అసలు ఆ ఎంఎల్‌ఎ క్రిస్టియన్ అని, అతడు ఎస్‌సి నియోజకవర్గంలో పోటీచేయడం కూడా తప్పు అని, ఆయన శాసనసభ్యత్వం రద్దు చేయాలనే వరకు విషయం వివాదాస్పదమైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆ ఎంఎల్‌ఎ పూర్తిగా ఆత్మరక్షణలో పడడం జరిగింది. తన స్థాయిని మరిచి ఆ విధంగా వ్యాఖ్యానించడం ప్రజాప్రతినిధి స్థాయికి తగని పని. రాజకీయాలలో ఈ రకంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడం ఒక వర్గం వారిని కించపరచడం భవిష్యత్తులో రాజకీయ నేతలకు ఏ రకమైన సందేశాన్నిస్తోంది? ఇక తమిళనాడులో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో డిఎంకె ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎండాకాలంలోనూ వరాల వర్షం కురిపిస్తున్నాడు. ప్రజలకు ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అన్నాడిఎంకె అభ్యర్థి తనకు సినీనటి నయనతార కావాలని, ముఖ్యమంత్రి తనకు సదరు సినీ నటిని ఇప్పించగలరా అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. అతడి మాటలు సభ్యసమాజానికి ఏహ్యభావం కలిగించేవే.
ఎన్నికల సభలో ప్రజలకు ఇచ్చే హామీలు కేవలం ఓటర్లను ఆకర్షించడానికి వారి నుండి ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే. కానీ ప్రతిపక్ష ఎంఎల్‌ఎ ఆ విధంగా దిగజారి మాట్లాడడం దారుణం. ఎన్నికల వివాదంలోనికి ఏమీ సంబంధంలేని దూరంగా ఉంటున్న సినీనటి ప్రస్తావన అనవసరం. అది కూడా ఆమెను అవమానించే విధంగా వ్యాఖ్యానించడం నిర్ద్వందంగా ఖండించవలసిందే. ఇలాంటి మాటలు ప్రస్తుతం ఎంఎల్‌ఎ మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థిగా అతని స్థాయికి తగనివి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సంయమనం కోల్పోయి మాట్లాడడం శోచనీయం. ఇలాంటి వారిని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. చట్టసభల్లో ప్రతినిధులు చర్చలలో పాల్గొనకుండా మౌనంగా ఉంటున్నారు. కొంతమంది నిద్రపోతుంటారు. మరి కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి ఎంఎల్‌ఎలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారాలు ఉండాలి.
వారు తమ బాధ్యతని ఎరిగి ప్రవర్తించకపోవడం అనైతికం. ఇలాంటివారు భవిష్యత్తులో తిరిగి పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటుకు అవకాశం కల్పించాలి. లేదంటే ప్రస్తుత కాలంలోనే వారిపై కొంతకాలం సస్పెన్షన్ వేటు వేయాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, సమాజంలోని ఒక వర్గాన్ని కించపరచడం, అనైతికంగా పార్టీలు మారడం, అసహ్యంగా మాట్లాడడం లాంటి నీతి బాహ్యమైన చర్యలకు శిక్ష విధించకపోతే వీరు భవిష్యత్తులో మరింత రెచ్చిపోతారు. రాజకీయాలు మరింత కలుషితమైపోతాయి, నేరమయమైపోతాయి. భవిష్యత్తులో రాబోయే రాజకీయ నేతలకు కూడా భయం ఉండదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా ప్రవర్తన ఇంతే అనే ప్రజాప్రతినిధులకు శిక్ష విధించాల్సిందే. సామాజిక విలువలకు కట్టుబడవలసిన అవసరాన్ని వారు గుర్తించాలి. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన నేతలు కట్టుతప్పి నీతికి, నైతికతకు తిలోదకాలు వదిలి స్పృహ కోల్పోయి ప్రవర్తించడం రాబోయే తరాలకు చెడు సందేశాలను ఇస్తుంది. ఇది భవిష్యత్తు రాజకీయాలకు మంచిది కాదు.
– ఐవి మురళీకృష్ణ శర్మ