
సినీ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ దూకుడు కొనసాగుతోంది. అసలు రికార్డుల వేట అంటే ఎలా ఉండాలో చూపిస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ చిత్రం సృష్టించిన సునామీకి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. రణ్‌వీర్ సింగ్ గర్జన, ఆదిత్య ధర్ అద్భుతమైన మేకింగ్ వెరసి.. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ గతంలో ఉన్న ఇండస్ట్రీ రికార్డులను చిత్తు చేస్తోంది.
11 రోజుల్లో రూ. 1365 కోట్ల విధ్వంసం!
లేటెస్ట్ అధికారిక లెక్కల ప్రకారం, ఈ చిత్రం విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,365 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఒకవైపు ఐపీఎల్ (IPL) ఫీవర్ నడుస్తున్నప్పటికీ, ఆదివారం నాడు ఈ సినిమా ఏకంగా రూ. 71 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి తన సత్తా చాటింది. దీంతో ఇండియాలో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 867 కోట్లకు చేరుకున్నాయి. గతంలో ‘పుష్ప 2’, ‘ఛావా’, మొదటి భాగం ‘ధురంధర్’ నెలకొల్పిన లైఫ్ టైమ్ రికార్డులన్నీ ఇప్పుడు ఈ సినిమా ముందు చిన్నబోయాయి.
అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా..
ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్ 2’ అగ్రస్థానంలో నిలిచింది. ఇండియాలో రూ. 800 కోట్ల మార్కును అత్యంత వేగంగా దాటిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. కేవలం హిందీ బెల్ట్ లోనే కాకుండా, సౌత్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం నిలకడగా రాణిస్తోంది. 11వ రోజున హిందీలో 45 శాతం ఆక్యుపెన్సీతో రూ. 17.31 కోట్లు సాధించగా, తెలుగు, తమిళ భాషల్లోనూ గణనీయమైన వసూళ్లు రాబట్టింది.
ఆర్జీవీ కామెంట్స్.. ఇండస్ట్రీలో అలజడి!
ఈ సినిమా సక్సెస్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆదిత్య ధర్ ఈ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ కింద అణుబాంబు పేల్చారు. రికార్డులన్నీ బూడిద అయిపోయాయి అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, ఈ భారీ విజయం తర్వాత ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో రణ్‌వీర్ సింగ్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కలిసి సందడి చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
My Review of the #Dhurandhars
My one line advise to all film students is “Leave your institutes and spend that money and time in #Dhurandhar2 theatres”
For all film students out there , here is what I studied of how , Aditya Dhar did not direct , but weaponized cinema…
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2026
నెక్ట్స్ టార్గెట్
ఈ సినిమా ధాటికి అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ వంటి పెద్ద సినిమాలు కూడా తమ విడుదల తేదీలను మార్చుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ఇండియాలో రూ. 1000 కోట్ల నెట్ వసూళ్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి 2 రికార్డులను సైతం ఈ సినిమా సవాల్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ‘ధురంధర్ 2’ కేవలం ఒక సినిమాగా కాకుండా బాక్సాఫీస్ వద్ద ఒక ఎమోషన్ లా మారిపోయింది.