Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాలు, జోన్‌లలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాలు, జోన్‌లలో పోస్టింగ్స్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఉద్యోగుల సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారని గుర్తు చేశారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాటు చేయడానికి అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జిఒ నంబర్ 317 జారీ చేసిందని తెలిపారు.

కానీ, ఆ జిఒలోనూ స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిఒ 317తో ఉద్యోగులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.