Reading Time: < 1 minute

అమెరికా కండీషన్స్ టూమచ్.. ఒప్పుకునేదే లేదు: 15 డిమాండ్లు లైట్ తీసుకున్న ఇరాన్

Caption of Image.

టెహ్రాన్: యుద్ధం ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 15 డిమాండ్ల శాంతి ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. అమెరికా కండీషన్స్ టూమచ్‎గా ఉన్నాయని.. ఒప్పుకునే సమస్యే లేదని ఖరాకండిగా చెప్పింది ఇరాన్. అమెరికా ప్రతిపాదనలు అవాస్తవికమైనవి, అసమంజసమైనవి అని అభివర్ణించింది ఇరాన్. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన15 షరతులు అతిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ వాటికి ఎన్నటికీ ఒప్పుకోదని తేల్చిచెప్పారు. యుద్ధం ముగింపు కోసం ఇప్పటి వరకు అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని తెలిపారు. 

సంప్రదింపులన్నీ కేవలం మధ్యవర్తుల ద్వారానే జరిగాయని స్పష్టం చేశారు. హోర్ముజ్ జల సంధి విషయంలో చర్చల కోసం అమెరికా మమ్మల్ని యాచిస్తోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం మాకు వద్దే వద్దన్నారు. దౌత్యం విషయంలో అమెరికా తరుచు మాటమారుస్తోందని కానీ యుద్ధం ముగింపు విషయంలో ఇరాన్ వైఖరి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. 

అమెరికా 15 షరతులు ఇవే:

యుద్ధాన్ని ఆపాలంటే 15 షరతులకు అంగీకరించాలంటూ ఇరాన్‎కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ పంపారు. అణు బాంబుల తయారీని ఇరాన్ పక్కనపెట్టాలని అలాగే హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. హిజ్బుల్లా వంటి ప్రాక్సీ టెర్రర్ గ్రూపులను పెంచి పోషించొద్దని కండీషన్ పెట్టారు. శాంతి ఒప్పందంపై చర్చించేందుకు వీలుగా నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలనీ ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు.

ఇరాన్ రిటన్ కండీషన్స్:

అమెరికా షరతులకు ఇరాన్ కూడా రిటర్న్ కండిషన్లు పెడుతూ ప్రపోజల్ పంపింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‎లను మూసేయాలని డిమాండ్ చేసింది. అలాగే, ఇరాన్‎పై అన్ని ఆంక్షలను ఎత్తేయాలని కోరింది. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని.. హార్మూజ్‎లో నౌకలపై ట్రాన్సిట్ ఫీజు విధించేందుకు అనుమతివ్వాలని షరతులు పెట్టింది. 
 

©️ VIL Media Pvt Ltd.