
హైదరాబాద్: సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ.14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని సిఎం చెప్పారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. సన్న బియ్యం పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని తెలిపారు.
రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని సిఎం అన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.