
అగ్రరాజ్యం అమెరికాకు నాటో కూటమిలో సభ్య దేశమైన స్పెయిన్ ఝలక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన వేళ స్పెయిన్ ఇందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌పై దాడులలో పాల్గొన్న అమెరికా విమానాలకు స్పెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. అలాగే, స్పెయిన్‌లో అమెరికా సైనిక స్థావరాల వినియోగాన్ని కూడా నిరాకరించింది. ఈ విషయాన్ని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబ్లెస్ ధృవీకరించారు.
ఇరాన్‌పై దాడులకు కోసం తమ సైనిక స్థావరాలు, గగనతలాన్ని ఉపయోగించడానికి అమెరికాను అనుమతించమని స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించబడిన యుద్ధంలో పాల్గొనకూడదని లేదా సహకరించకూడదని స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ చర్య అని పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను స్పెయిన్ మొదటి నుంచే తీవ్ర వ్యతిరేకిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిర్లక్ష్యపూరితమైనవిగా, చట్టవిరుద్ధమైనవిగా స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ఇప్పటికే తీవ్రంగా విమర్శించారు.
కాగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాదు కూడదు అని ముందుకెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు.
హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు, రవాణాకు ఆటంకం లేకుండా చూసేందుకు అమెరికా మిత్ర దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రాలేదు. హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది.
బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. దీంతో తమ మిత్రదేశాలపై ట్రంప్ నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న అలజడిని అణచివేసేందుకు సైనిక సహకారం అందించని దేశాలను ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలం వాడారు. మీరంతా పిరికివాళ్లు (కోవార్డ్స్).. క్లిష్ట సమయంలో మీరు చేసిన ఈ పనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అంటూ హెచ్చరించారు. అమెరికా అండ లేకపోతే నాటో కేవలం ఒక ‘కాగితపు పులి’ అని ఆయన ఎద్దేవా చేశారు.
ఫిర్యాదులకు సిద్ధం.. సాయానికి దూరం!
చమురు ధరలు పెరిగిపోతున్నాయని ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్న మిత్రదేశాలు, ఆ ధరలను తగ్గించేందుకు అవసరమైన హార్మూజ్ జలసంధి పునరుద్ధరణలో మాత్రం చేతులు ముడుచుకు కూర్చున్నాయని ట్రంప్ మండిపడ్డారు. యుద్ధం మొదలవ్వకముందు 70 డాలర్లున్న బ్యారెల్ ధర ఇప్పుడు 108 డాలర్లకు చేరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. నాటో దేశాలకు అమెరికా ఇన్నాళ్లూ కొండంత అండగా నిలిచినా, ఇప్పుడు ఇరాన్ అణు ముప్పును అడ్డుకోవడంలో వారు వెనకడుగు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.