
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ వేళ బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కి షాకిచ్చింది. భారత్ కి చెందిన జియోస్టార్ (JioStar) బంగ్లాలో ఐపీఎల్ ప్రసార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది. ఐపీఎల్ ప్రసారాలపై గతంలో విధించిన నిషేధంపై పునరాలోచిస్తున్నట్లు అక్కడి సర్కార్ చెప్పిన తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని టీస్పోర్ట్స్ (బంగ్లాదేశ్ బ్రాడ్కాస్టర్)కు జియోస్టార్ రాసిన లేఖ ఆధారంగా ఇంటర్నేషపన్ మీడియా కథనాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం భాగస్వామ్య పక్షం గడువులోగా చెల్లింపులు చేయడంలో ప్రతిసారి ఫెయిల్ కావడమే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఉన్న సమయంలో హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు జరిగాయి. అలాంటి సమయంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను మినీ వేలంలో కేకేఆర్ రూ.9.20కోట్లకు సొంతం చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతరం బంగ్లాదేశ్ సర్కార్.. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
బంగ్లాలో కొత్తగా ఏర్పడిన సర్కార్ ఆ నిషేధంపై పునరాలోచిస్తామని సంకేతాలు ఇచ్చేసింది. ఇంతలోనే జియో డీల్ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అయింది. ఇందుకు భాగస్వాముల మధ్య ఉన్న ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ గా పేరుగాంచిన ఐపీఎల్ ను ఢాకా ఫ్యాన్స్ బాగా ఆదరిస్తారు. తాజా నిర్ణయం వ్యూయర్షిప్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ పై తీవ్ర ప్రభావం చూపించనుంది. కాగా, జియో నిర్ణయంతో ఐపీఎల్ ప్రసారాల కోసం 2027 వరకు టీస్పోర్ట్స్ కి ఉన్న పర్మిషన్స్ రద్దు అయ్యాయి.