
మన తెలంగాణ/హైదరాబాద్ : రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌తో శాసనమండలి కార్యకలాపాలకు అడ్డుతగిలిన ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 11 మంది ఎంఎల్‌సిలను సభ నుంచి చైర్మన్ గత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెండ్ చేశారు.పెద్దల సభ గౌరవాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్మన్ ఆమోదిస్తూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అయితే సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ బయటికి వెళ్లడానికి నిరాకరించిన ఎమ్మెల్సీలపై ఒకదశలో ‘గెటవుట్’ అంటూ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మీలాంటి వారు సభకు రావడం దురదృష్టకరం&పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చారు’ అని చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు.
శాసన మండలిలో సోమవారం బీఆర్‌ఎస్ సభ్యులు, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛైర్మెన్ పోడియం దగ్గరికి దూసుకెళ్లారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల ఆందోళన మధ్యనే తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఛైర్మన్ పోడియం వద్ద కు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా శాసనసభలో స్పష్టం చేశామన్నారు. సభ సజావుగా సాగేందుకు బిఆర్‌ఎస్ సహకరించాలని కోరారు. మరో వైపు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలను పదే పదే కోరారు. సభ్యుల ప్రవర్తన సభా నియమావళికి విరుద్ధమని చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు 11 మందిని సభ నుండి సస్పెండ్ చేస్తోన్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా మార్షల్స్‌కు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలకు మధ్య తోపులాట జరిగింది. సస్పెన్షన్ వేటు వేసిన తరువాత సైతం సభలోనే ఉండి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు చైర్మన్ పోడియం చుట్టుముట్టే ప్రయత్నం చేయడం, నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్ అయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు : మధుసూదన్ చారీ, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డి, వంటేర్ యాదవ రెడ్డి, శంబీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, కోటి రెడ్డి, వాణీ దేవి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.****