Reading Time: 2 minutes
బాల్ ట్యాంపరింగ్‌కు ముందే ప్లాన్ చేశారా.. అర్ధరాత్రి హోటల్ గదిలో షాహీన్ అఫ్రిదీ సీక్రెట్ మీటింగ్..?

Shaheen Afridi controversy: లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ, విదేశీ ప్లేయర్ సికందర్ రజా తమ జట్టు భద్రతా ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కరాచీ కింగ్స్‌తో మ్యాచ్ జరగడానికి ముందు రోజు రాత్రి, లాహోర్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

డీఐజీ (ఆపరేషన్స్, లాహోర్) మహ్మద్ ఫైసల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది జట్ల కోసం కఠినమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నప్పటికీ, అఫ్రిదీ, రజా తమ హోటల్ గదిలో నలుగురు అతిథులకు ఆతిథ్యం ఇచ్చారు. రాత్రి 1:25 గంటల వరకు ఈ సమావేశం కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పీసీబీ (PCB) సెక్యూరిటీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని అధికారులు స్పష్టం చేశారు.

తిరస్కరించిన పీసీబీ.. మొండిగా వెళ్లిన అఫ్రిదీ..

ఈ వివాదంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతిథులను గదిలోకి అనుమతించాలని లాహోర్ ఖలందర్స్ యాజమాన్యం ముందుగానే కోరింది. టీమ్ ఓనర్ సమీన్ రాణా శనివారం రాత్రి 10:35 గంటలకు, ఆ తర్వాత 11:00 గంటలకు పీసీబీ సీఈఓ సల్మాన్ నసీర్‌ను సంప్రదించి సికందర్ రజా బంధువులను గదిలోకి అనుమతించాలని కోరారు.

అయితే, అవినీతి నిరోధక, భద్రతా విభాగం నిబంధనల ప్రకారం ఈ అభ్యర్థనలను అధికారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అనుమతి లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ, భద్రతా సిబ్బంది ప్రతిఘటనను కాదని షాహీన్ అఫ్రిదీ, రజాలు ఆ నలుగురు వ్యక్తులను లోపలికి తీసుకెళ్లడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

బాల్ టాంపరింగ్ వివాదం, పెనాల్టీ..

ఈ హోటల్ వివాదం బయటకు రాకముందే, కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌కు ముందు షాహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, ఫఖర్ జమాన్ బంతిని పట్టుకుని దాని ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశారని అంపైర్లు ఫైసల్ అఫ్రిదీ, షరఫుద్దౌలా గుర్తించారు. దీని ఫలితంగా కరాచీ కింగ్స్‌కు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. ఈ అదనపు పరుగులే లాహోర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి.

ప్రమాదంలో కెరీర్?

వరుస వివాదాలు షాహీన్ అఫ్రిదీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు మైదానంలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం, మరోవైపు హోటల్‌లో భద్రతా నిబంధనలు అతిక్రమించడంపై పీసీబీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలీసు అధికారులు ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే హోటల్ జోన్‌లోకి బయటి వ్యక్తులు రావడం వల్ల ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.