
హైదరాబాద్: కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని, దీనివల్ల లక్ష కోట్ల ప్రజాధనం వృథాగా నీటి పాలయ్యిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం లిఖిత పూర్వకంగా పలు అంశాలను వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని బిఆర్‌ఎస్ ఎంపి సురేశ్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఎస్‌ఏ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ వద్ద జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లు ఉన్నా ఈ మూడేళ్లలో రూ.194 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు అందలేదని సిఆర్ పాటిల్ వెల్లడించారు.
99 ప్రాజెక్టుల్లో 71 పనులు చాలాకాలంగా నిలిచిపోయాయని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను పిఎంకెఎస్‌వై కింద చేర్చడం జరిగిందని, వాటిలో అర్హత ఉన్న వాటికి కేంద్రం సహాయంగా రూ. 1,129.80 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ. 981.49 కోట్లను ఇప్పటివరకు కేంద్ర సహాయంగా అందించిందని ఆయన వెల్లడించారు