
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకులు జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. హింసమార్గాన్ని విడిచి కుటుంబంతో గౌరవప్రదమైన జీవితం గడపాలని చెప్పారు. రెండేళ్లలో 721 మంది మావోయిస్టు కేడర్ లొంగిపోయారు..వాళ్లందరికీ పునరావాస పథకం కింద అన్ని ప్రయోజనాలు అందించామన్నారు.
తెలంగాణకు చెందిన అజ్ఞాత కేడర్ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. వీరిలో జిగిత్యాల జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, హనుమకొండ జిల్లాకు చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ , సికింద్రాబాద్‌కు చెందిన వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, గద్వాల్‌కు చెందిన జోడే రత్నబాయి అలియాస్ సుజాత ఈమె గణపతి భార్య, హైదరాబాద్‌కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లాకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఉన్నారని వెల్లడించారు డీజీపీ. వీరంతా ఆయుధాలు వీడి జనంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని.. ఆయన జనంలోకి తిరిగి వస్తే తగిన వైద్యం అందిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు డీజీపీ.
రాష్ట్రం ప్రభుత్వ పునరావాస విధానం పట్ల ఇతర రాష్ట్రాల్లోని కేడర్‌లోనూ విశ్వాసం పెరిగి లొంగిపోతున్నారని అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.
డెడ్‌లైన్ దాటితే.. తర్వాత పరిస్థితి ఏంటి..
కేంద్రం చెబుతున్న ప్రకారం.. మార్చి 31న మావోయిస్టులకు ‘డెడ్’లైన్ పూర్తవుతుంది. తాము అజ్ఞాతం వీడి జనం మధ్య, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు. అదే సమయంలో మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. కేంద్రం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలోనూ కీలక మావోయిస్టు నేతలు ఈమేరకు ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిసి చెప్పారు. వీరి ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సానుకూలత రావడం, తాజాగా డెడ్‌లైన్ ముగియనున్న నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా ఏడుగురు మావోయిస్టులు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మావోయిస్టుల లొంగుబాటులో రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఐబీ పోలీసుల కృషిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.