
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంపై చలి ప్రతాపం చూపిస్తోంది. మధ్యాహ్నాం అయినా చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ క్రమంలో రానున్న రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావానికి ప్రధానంగా చలిగాలులే కారణంగా వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది. రెండు రోజుల పాటు పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత కొన్నిరోజులుగా రాత్రివేళల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. గత రెండు రోజులుగా పట్టపగలే చలి గజగజ వణికించింది. చలికి తోడు ఉదయం మంచు దట్టంగా అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నాం అయినా మంచు, చలి గాలులు వీడకపోవడంతో బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రోజంతా చలి తీవ్రత ఉంటుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చలి ప్రభావంతో ఆదివారం ఉదయం 8గంటల 30 నిమిషాల వరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పాటు ఆదిలాబాద్ లో 7.9, సంగారెడ్డిలో 8.9, రంగారెడ్డిలో 9, కామారెడ్డిలో 9.1, నిజామాబాద్‌లో 9.5, వికారాబాద్, నిర్మల్‌లో 9.6, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 9.8, రాజన్న సిరిసిల్లలో 10 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు.