Reading Time: < 1 minute

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి నడుపుతోంది సర్కారా లేక సర్కస్ కంపెనీనా..? అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా తాను సిఎంగా ఉన్నంతకాలం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాత్రికి రాత్రే జిఒలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జిఒలు ఇచ్చారని, మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నారని ఆరోపించారు. సభను, ప్రజలను ఇంత నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టించడం తగదని మండిపడ్డారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సినీ పరిశ్రమపై రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. పాలకుడు పాలసీతో ఉండాలి కానీ, పగతో ఉండకూడదని హితవు పలికారు. వచ్చేది కెసిఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్షగడతారు..రేవంత్‌రెడ్డి పేరు మరిచినందుకు మరో హీరోను జైలుకు పంపుతారని ఆరోపించారు.

ఇప్పుడు సిఎంకు నచ్చిన వారికి రూ. 600 టికెట్ రేటుకు అనుమతి ఇస్తారా..? అని ప్రశ్నించారు. గత పదేళ్లు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఎక్కడా వివక్ష చూపలేదని తెలిపారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని, ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయని వ్యాఖ్యానించారు. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. రేవంత్‌రెడ్డి అహంకారంతో, ఆయన పిచ్చి చేష్టలతో, పగ ప్రతీకారాలతో, చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలని, ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదని సూచించారు. సినిమా వాళ్లను కూడా రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని, ఇది ప్రజా పాలన కాదు.. ఇది కాంగ్రెస్ పాపిష్టి పాలనకు పరాకాష్ఠ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో.. ఒక్కో సినిమాకు కమీషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతామని వెల్లడించారు. సినిమా టికెట్ల రేట్ల కమీషన్ల దందాపై గవర్నర్ తక్షణమే దృష్టి సారించి, సమగ్ర విచారణకు ఆదేశించాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.