
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కు 100 శాతం లైఫ్ ట్యాక్స్ మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చి నుంచి పాలసీ అమల్లోకి రాగా, ఏడాది తిరిగేసరికి అంటే 2026 మార్చి వరకు రాష్ట్రంలోని వివిధ షోరూంలలో లక్షా 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయాయి. రవాణా శాఖ వద్ద రిజిస్ట్రేషన్ వివరాలను బట్టి ఈ వెహికల్స్‌లో 78 వేల వరకు టూ వీలర్స్ ఉండగా.. 23 వేల పైగా కార్లు, 5 వేల వరకు త్రీ వీలర్ ఆటోలు, లైట్ గూడ్స్, లైట్ క్యారెజెస్ ఉన్నాయి. మరో 250 వరకు బస్సులు ఉన్నాయి. ఇందులో భాగంగా 100 శాతం లైఫ్ ట్యాక్స్ మాఫీ కింద ప్రభుత్వం రూ. 860 కోట్లకు పైగా రాయితీ ఇచ్చింది.
ఈ ఏడాది చివరి కల్లా 3 లక్షల ఈవీలు అమ్ముడుపోతాయనే అంచనా..
ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20 శాతం వరకు రాయితీ ఇస్తామని ఇటీవలే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వశాఖల్లో కొత్తగా కొనుగోలుచేసే వాహనాలను కూడా ఎలక్ట్రిక్వాహనాలే అయి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో రానున్న రోజుల్లో ఈవీ వాహనాల కొనుగోలు, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇరాన్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ కొరతపై జనాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో చాలా మంది ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఈవీ వెహికిల్స్ రేట్లు క్రమంగా తగ్గుతుండడంతో ఇన్నాళ్లూ టూవీలర్స్కే పరిమితమైన మిడిల్క్లాస్ఇప్పుడు కార్లు కూడా కొనుగోలు చేస్తున్నారు.
కాగా, ఈ ఏడాది డిసెంబర్ తో ఈవీలకు 100 శాతం లైఫ్ ట్యాక్స్ రాయితీ గడువు ముగియనుంది. దీంతో రానున్న రోజుల్లో ఈవీల కొనుగోళ్లు భారీగానే పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఏం తక్కువ మరో మూడు లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు కొనే అవకాశం ఉందని రవాణా శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాలకు లైఫ్ టాక్స్ కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 860 కోట్లకు పైగానే రాయితీ ఇచ్చింది.
మరో వెయ్యి కోట్లయినా రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల మంత్రి పొన్నం ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలు ముందున్నాయని, వాటిని అధిగమించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించడాన్ని బట్టి ఈవీ పాలసీని ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.