
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాంకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు క్యూ నెట్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్కాంకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.10 మందిని అదుపులోకి తీసుకొని విచారించింది సిట్. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి… ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా మోసానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు.
ఐటీ ఉద్యోగులకు బ్యాంక్ లోన్‌లు ఇప్పించి క్యూనెట్ వలలో చిక్కుకునేలా చేశారని తెలిపారు పోలీసులు. ఒక్కో ఏజెంట్ 500 మంది ఐటీ ఉద్యోగులను చేర్పించేలా టార్గెట్ ఫిక్స్ చేశారని విచారణలో వెల్లడిందని తెలిపారు పోలీసులు. ఈ స్కాంలో చిక్కుకున్న బాధితులు ఇప్పటికీ EMIలు కడుతున్నామని వాపోతున్నారు. బాధితులతో ముందుగానే బాండ్లు రాయించుకొని పకడ్బందీగా స్కాంకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు.
మార్చి 23న మూడు రాష్ట్రాల్లోని క్యూ నెట్ ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు పోలీసులు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల సోదాలు జరిగాయి.హైదరాబాద్ లో 6 చోట్ల పోలీసులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 20 మంది నిందితులను గుర్తించారు. మూడు రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో సోదాలు జరిపారు పోలీసులు.
క్యూనెట్ మోసాలపై ఇటీవల మరో రెండు కేసులు నమోదు కావడంతో సోదాలు నిర్వహించారు పోలీసులు. సిసిఎస్ లో ఇప్పటికే క్యూ నెట్ పై ఆరు కేసులు నమోదయ్యాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించిన పోలీసులు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్ లోనూ సోదాలు జరిపారు.