Reading Time: 2 minutes
Virat Kohli London Joke Rcb Ipl 2026 Overseas Player Comment

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో దుమ్ము రేపుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్‌లో తొలిసారిగా కైవసం చేసుకున్న టైటిల్‌ను కాపాడుకోవడంలో ఆర్‌సీబీకి విరాట్ అండగా ఉన్నాడు. అయితే, ఈ టోర్నీకి ముందు కోహ్లీ పెద్దగా ప్రాక్టీస్ సెషన్లలో కనిపించలేదు. జనవరిలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఎక్కువ సమయం గడిపాడు. భారత్‌లో తనపై ఉండే విపరీతమైన క్రేజ్, నిరంతర నిఘా నుంచి దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎక్కువగా లండన్‌లో ఉండటంపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. తాజాగా ఆర్‌సీబీ కంటెంట్ క్రియేటర్ ‘మిస్టర్ నాగ్స్’ (డానిష్ సేత్) తో జరిగిన సరదా సంభాషణలో ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. “కోహ్లీ లండన్‌లో ఉంటున్నారు కాబట్టి.. ఆర్‌సీబీ ఈసారి నలుగురు కాదు, ఐదుగురు ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లతో ఆడుతోందని అందరూ జోకులు వేస్తున్నారు, దీనిపై మీరేమంటారు?” అని అడగ్గా.. కోహ్లీ నవ్వుతూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. “నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్లి ఆ విదేశీ ఆటగాళ్లనే అడుగు. నేనేం ఓవర్సీస్ ప్లేయర్‌ని కాదు కదా? నేనేమైనా విదేశీ ఆటగాడిలా కనిపిస్తున్నానా?” అంటూ సరదాగా కొట్టిపారేశారు.

READ MORE: Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli).. భార్య, పిల్లలతో కలిసి త్వరలో లండన్‌లో స్థిరపడతాడని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. తన రిటైర్మెంట్ అనంతరం మిగిలిన జీవితాన్ని లండన్‌లోనే గడపాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్‌ శర్మ గతంలో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్‌లో పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తోంది. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్‌ సైతం లండన్‌లోనే జన్మించడం గమనార్హం. కోహ్లీ కుటుంబం గతేడాది, ఈ ఏడాది సైతం ఎక్కువ కాలం లండన్‌లో గడిపింది. అక్కడ కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నాయట. ‘అవును.. విరాట్ తన పిల్లలు, భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను భారత్‌ను వదిలి అతి త్వరలో యూకేకు షిఫ్ట్ కాబోతున్నాడు. అయితే, ప్రస్తుతం కోహ్లీ క్రికెట్‌తో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు’ అని గతంలో రాజ్‌కుమార్‌ శర్మ తెలిపారు.