
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించి.. తన సత్తా చాటింది. అయితే ఈ విజయోత్సాహంలో ఉన్న పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు జట్టు సభ్యులకు ఐపిఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా అయ్యర్‌తో పాటు ఇతర ఆటగాళ్లపై భారీ జరిమానా విధించింది. అయ్యర్‌కు రూ.24 లక్షలు, ప్లేయర్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.
‘‘ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రెండోసారి స్లో ఓవర్‌రేట్‌ను ఎదుర్కొంది. ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం.. కెప్టెన్ శ్రేయస్‌పై రూ.24 లక్షలు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా మిగితా ఆటగాళ్లపై రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాను మ్యాచ్ రిఫరీ విధించారు’’ అని ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. అయితే ఇదే తప్పు మూడో సారి జరిగితే గతంలో ఒక మ్యాచ్ నిషేధం ఉండేది. కానీ, గత సీజన్ ఐపిఎల్ కొన్ని నిబంధనలు మార్చింది. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. మూడో సారి తప్పిదానికి పాల్పడినా.. ఆ కెప్టెన్‌పై జరిమానా పెరుగుతూ పోతుంది. అంతేకానీ, నిషేధం ఉండదు. ఒకవేళ మళ్లీ శ్రేయస్ అయ్యర్ ఇదే తప్పిదానికి పాల్పడితే అతడిపై రూ.36 లక్షలు జరిమానా పడుతుంది. అలాగే ప్లేయర్లపై 50 శాతం వరకూ మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం ఉంది.