
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సాఫీగా జరగాలన్నా.. ఏదైనా డాక్యుమెంట్ బయటకు రావాలన్నా ప్రతిదానికీ ‘లెక్క’ ముట్టాల్సిందే! ‘చేయి తడిపితేనే సంతకం.. కమీషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్’ అనేలా పరిస్థితి తయారైంది. సర్కారు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. ‘నో ఏజెంట్ పాలసీ’ అంటూ నిబంధనలు తెచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పైరవీకారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల రాజ్యమే నడుస్తున్నది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. రిజిస్ట్రేషన్ శాఖలో వసూళ్ల కోసమే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కొందరు. ఈ వ్యవస్థకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వచ్చాయి.
ప్రభుత్వం పారదర్శకతను పెంచేందుకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే స్లాట్ బుకింగ్ విధానం కూడా తీసుకువచ్చింది. దీంతో సామాన్యులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఈ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చే వారికి సాంకేతిక కారణాలు చూపుతూ ఆలస్యం చేయడం, అదే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వస్తే నిమిషాల్లో పని పూర్తి చేయడం ఆనవాయితీగా మారింది.
అధికారులు ముందస్తుగానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, స్పెషల్ ఫీజుల పేరుతో వేల రూపాయలు రిజిస్ట్రేషన్ల కోసం వసూలు చేస్తున్నారు. నియమ, నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, ఫైలును ముందుకు కదపకుండా పెండింగ్‌లో పెడుతూ క్రయ, విక్రయదారులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. డాక్యుమెంట్లలో చిన్నపాటి సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ భయపెట్టడం, సర్వర్లు సరిగ్గా పనిచేయడం లేదని సాకులు చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు.
- పర్యవేక్షణ లేదు.. సీసీటీవీలు లేవు..
అవినీతిని అరికట్టేందుకు ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి లైవ్ ఫీడ్‌ను జిల్లా రిజిస్ట్రార్, ఐజీ కార్యాలయాలకు అనుసంధానించాలని నిబంధన ఉంది. ఎక్కడైనా అనధికారిక కదలికలు ఉంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిఘా వ్యవస్థ కేవలం ప్రదర్శన వస్తువుగా మారింది.
కెమెరాలు పని చేయకపోవడం లేదా కావాలనే వాటిని పక్కదారి పట్టించడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎంట్రీ పాస్ విధానం, స్లాట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపే నిబంధనలు ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకొని అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు.
గత 8 నెలల కాలంలోనే ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ, 20 మందికి పైగా ఎస్ఆర్‌ల ఇండ్ల పై దాడులు చేసినా అవినీతి తిమింగలాల తీరు మారడం లేదు. ఏడాది కాలంలో 15 మంది ఎస్ఆర్ఓలు, సీనియర్ అసిస్టెంట్లు ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లినా, వ్యవస్థలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కేవలం దాడులతో సరిపెట్టకుండా, శాఖాపరమైన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్స్‌డ్ డాక్యుమెంట్ రైటర్ల ముసుగులో సాగుతున్న అక్రమ ఏజెంట్ దందాను పూర్తిగా నిషేధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.