
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధరపై 80 రూపాయలు తగ్గించినట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెషబాజ్ షరీఫ్ తెలిపారు. 80 రూపాయలు రేటు తగ్గాక పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 378 రూపాయలకు చేరింది.
పశ్చిమాసియాలో ఘర్షణలను సాకుగా చూపించి పాకిస్తాన్ లో ఇంధన ధరలను అక్కడి ప్రభుత్వం ఇటీవలే భారీగా పెంచింది. డీజిల్ ధరలను 54.9% పెంచి లీటరు 520.35 పాకిస్తానీ రూపాయలకు, పెట్రోల్ ధరలను 42.7% పెంచి లీటరుకు 458.40 రూపాయలకు చేరింది. ఈ పెంపుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి పెంచిన ఒక్కరోజులోనే లీటర్ పెట్రోల్పై రూ.80 తగ్గించింది.
పెట్రోల్ ధరను తగ్గించిన పాకిస్తాన్ ప్రభుత్వం డీజిల్ ధరలో ఎలాంటి తగ్గింపును ప్రకటించకపోవడం గమనార్హం. 54.9 శాతం ధరల పెంపు తర్వాత కూడా డీజిల్ ధరను పాక్ ప్రధాని షరీఫ్ తగ్గించకపోవడం గమనార్హం. దీంతో.. లీటర్ డీజిల్ ధర పాకిస్తాన్ దేశంలో 520 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ప్రజలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. పెరిగిన ఇంధన ధరలు ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని.. ప్రజలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించినట్లు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి తెలిపారు.