
ఒక్కగానొక్క కొడుకులు అల్లారు ముద్దుగా పెంచారు. బైక్ కావాలంటే కొనిచ్చారు. కానీ ఆ బైకే వారి ప్రాణాలు తీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. జగిత్యాల జిల్లాలో జరిగిన బైక్ ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం తీవ్ర విషాదం మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల శివారులో జరిగింది ఈ ప్రమాదం. రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొటడంతో ఆదిత్య అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడు విగ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే మృతి చెందాడు.
పెగడపల్లి నుండి కోరుట్ల సమీపంలో ఫంక్షన్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. మృతులు ఇద్దరూ తమ కుటుంబాలకు ఒక్కగానొక్క కొడుకులు. కుమారుల మృతితో కన్నతల్లుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.