
వడోదర: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచిన రోహిత్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 39 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది.
ఆదుకున్న విరాట్, గిల్
ఈ దశలో స్కోరును ముందుకు నడిపించే బాధ్యతను కెప్టెన్ గిల్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి తమపై వేసుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. గిల్ ఆత్మరక్షణతో ఆడగా విరాట్ కాస్త దూకుడును ప్రదర్శించాడు. ఇదే సమయంలో ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు కీలకమైన 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్సీఇన్నింగ్స్ ఆడిన 71 బంతుల్లో రెండు సిక్స్‌లు, 3 ఫోర్లతో 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లి మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌లో పాలుపంచుకున్నాడు. శ్రేయస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కోహ్లి కూడా జోరందుకున్నాడు. అయితే 91 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా, కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో 28 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ సంగాక్కరను వెనక్కినెట్టి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రెండో స్థానం దక్కించుకున్నాడు. ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లి కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఉన్నాడు. మరోవైపు అయ్యర్ 4 ఫోర్లు, సిక్స్‌తో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా (4) విఫలమయ్యాడు. కానీ హర్షిత్ రాణా (29), సుందర్ 7 (నాటౌట్)లతో కలిసి రాహుల్ జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 21 బంతుల్లోనే అజేయంగా 29 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవోన్ కాన్వే (56), నికోల్స్ (62) శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన డారిల్ మిఛెల్ 71 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. చివర్లో క్రిస్టియన్ 24 (నాటౌట్) రాణించడంతో కివీస్ స్కోరు 300 పరుగులకు చేరింది.