Reading Time: 2 minutes

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్.. MLAల కేసులో కీలక తీర్పు

Caption of Image.

హైదరాబాద్: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLAల కేసులో తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ప్రకటించారు. MLAల అనర్హత పిటిషన్లను స్పీకర్‌ కొట్టేశారు. ఐదుగురు MLAలపై ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్‌ చెప్పారు. స్పీకర్ నిర్ణయంతో.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌, ప్రకాష్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌కు ఊరట లభించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‎పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

బీఆర్ఎస్ నేతల పిటిషన్‎ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్.. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రెటరీ డివిజన్ బెంచ్‎లో సవాల్ చేశారు. ఈ పిటిషన్‎ను విచారించిన డివిజన్ బెంచ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. 2025, ఏప్రిల్ 3న 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసింది. 2025, జూలై 31న ఈ కేసులో తీర్పు వెలువరించింది.

ALSO READ : థర్డ్ ఫేజ్.. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సూచిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఈ తీర్పు సమయంలో స్పీకర్కు స్పష్టం చేసింది. ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హతను తోసిపుచ్చిన స్పీకర్.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ పై గురువారం తీర్పు వెల్లడించనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు దానం, కడియం మరింత గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వివరణ తర్వాత స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.

©️ VIL Media Pvt Ltd.