
ఓ గంట నెట్ వర్క్ లేకపోతేలే అల్లాడిపోతున్నామ్మా ఈ రోజుల్లో.. ఓ గంట ఖాళీగా ఉంటే చాలు బోర్ కొడుతుంది అంటూ కస్సుబుస్సులాడుతున్నారమ్మా ఈ రోజుల్లో.. అలాంటిది ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. టెక్కింగ్ కోసం అడవికి వెళ్లింది. తన టీం నుంచి తప్పిపోయింది.. నాలుగు రోజులు దట్టమైన అడవిలో ఉంది.. జస్ట్ అర లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే ఉంది.. సెల్ ఫోన్ ఉంది.. అందులో బ్యాటరీ డెడ్.. నెట్ వర్క్ లేదు.. ఏనుగులు, పులులు తిరిగే ఆ అడవిలో ఆ నాలుగు రోజులు శరణ్య ఎలా గడిపింది.. ఎట్టకేలకు దొరికిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య మిస్సింగ్ కథ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. మనమూ తెలుసుకుందామా..
శరణ్య.. వయస్సు 36 ఏళ్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. కేరళ రాష్ట్రం. కో్జికోడ్ లో ఉద్యోగం. తన టీంతో కలిసి కర్నాటక రాష్ట్రం కొడగు జిల్లాల్లోని దట్టమైన అడవిలో 2026, ఏప్రిల్ 2వ తేదీన ట్రెక్కింగ్ కోసం వెళ్లింది. దట్టమైన అడవి.. చుట్టూ గుట్టలు, కొండలు, పెద్ద రాళ్లు.. పెద్ద పెద్ద చెట్ల మధ్య నుంచి ట్రెక్కింగ్ మొదలుపెట్టిన బృందం.. బాగా లోపలికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత బృందం అంతా తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యలో శరణ్య తప్పిపోయింది. బృందం నుంచి విడిపోయింది. అడవి నుంచి బయటకు వచ్చిన బృందం.. శరణ్య కోసం చుట్టూ వెతికినా లాభం లేకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి.. అప్పటికే చీకటి పడటంతో అటు కర్నాటక, ఇటు కేరళ ప్రభుత్వాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టలేకపోయాయి. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం నుంచి డ్రోన్లతోపాటు స్థానిక గిరిజనుల సాయంతో వెతకటం ప్రారంభించారు. ఎట్టకేలక ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం సాయంత్రం శరణ్య ఆచూకీ లభించింది. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
4 రోజులు అడవిలో ఎలా ఉన్నారో.. శరణ్య మాటల్లోనే విందామా..!
ఏప్రిల్ 2వ తేదీ తప్పిపోయిన విషయాన్ని గుర్తించాను. ఆ రోజు సాయంత్రం చీకటి పడే వరకు నడుస్తూనే ఉన్నాను. చీకటి పడిన తర్వాత ఎటు వెళ్లాలో అర్థం కాక.. ఓ వాగు దగ్గర ఉండిపోయాను. రాత్రంతా చీకట్లు.. చుట్టూ జనం లేరు.. ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది.. నెట్ వర్క్ లేదు.. ఏం చేయాలో అర్థంకాక రాత్రంతా ఒంటరిగా ఉండిపోయాను
ఏప్రిల్ 3వ తేదీ ఉదయం మళ్లీ నడక మొదలుపెట్టాను. ఎవరైనా కనిపిస్తారేమో అని.. మైదాన ప్రాంతం వస్తుందోమో అని నడుస్తూనే ఉన్నాను. ఆ రోజు వర్షం పడింది. దీంతో ఎక్కువ దూరం నడవలేకపోయాను. రెండో రోజు భయం వేయలేదు. ఎందుకో మరి.. ఎంతో ప్రశాంతంగా.. నిబ్బరంగా ఉన్నాను. ఆ రోజు రాత్రి కూడా ఓ చిన్న కొలను దగ్గర ఆగాను.. రాత్రంతా ఒంటరిగానే ఉన్నాను. కనీసం సెల్ ఫోన్ వెలుతురు కూడా లేదు.
ఏప్రిల్ 4వ తేదీ ఉదయం వర్షంలోనే నడక మొదలుపెట్టాను. నేను ఉన్న ప్రదేశం నుంచి కొంత దూరంలో కొండ ఉంది. ఆ కొండపై మనుషులు కనిపించారు. పెద్దగా అరిచాను.. కేకలు వేశాను. వాళ్ల దగ్గరకు చేరుకోవటానికి వేగంగా నడిచాను.. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ మనుషులు కనిపించలేదు. ఎటు వెళుతున్నానో కూడా నాకు అర్థం కాలేదు. కొండపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నా.. వర్షం వల్ల వెళ్లలేకపోయాను.
నా కోసం వెతుకుతారు.. నా కోసం కొన్ని బృందాలు వస్తాయి అని గట్టిగా నమ్మాను. డ్రోన్ల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తారనే నమ్మకంతో.. డ్రోన్లకు కనిపించే విధంగా.. చెట్లు లేకుండా ఆకాశం కనిపించే ప్రాంతాల్లోనే ఉండటానికి ప్రయత్నించాను అని చెప్పుకొచ్చింది శరణ్య. చాలా సార్లు అరుస్తూనే ఉన్నాను.. కేకలు వేస్తూ ఉన్నాను.. ఎవరైనా నా మాటలు విని రక్షిస్తారేమో అని.. మూడు రోజులు నా ప్రయత్నాలు ఫలించలేదు.
ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం.. కొడగు అటవీ ప్రాంతంలోని ఓ మారుమూల ప్రాంతంలో.. ఎవరూ అటు వైపు వెళ్లని ప్రాంతంలో.. కొంత మంది గిరిజనులకు కనిపించింది శరణ్య. విషయం తెలిసిన గిరిజనులు ఆమెను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. గిరిజనులకు శరణ్య కనిపించిన ప్రదేశం.. చాలా దట్టమైన అటవీ ప్రాంతం అని.. అలాంటి చోటుకు ఎవరూ వెళ్లరని.. అడవిలో తప్పిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి శరణ్య వచ్చినట్లు చెబుతున్నారు గిరిజనులు.
ఆమెను వెంటనే అంబులెన్స్ లో సమీపంలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి గాయాలు కాలేదని.. నిబ్బరంగానే.. దైర్యంగానే ఉందని వెల్లడించారు డాక్టర్లు.
శరణ్య ఆచూకీ దొరకటంతో అటు కర్నాటక, ఇటు కేరళ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అడవిలో తప్పిపోతే ఎంత కష్టమో ఈ సెర్చ్ ఆపరేషన్ స్పష్టం చేస్తుందన్నారు. ట్రెక్కింగ్ కు వెళ్లే వాళ్లు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని.. నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచిస్తున్నారు అధికారులు.
మొత్తానికి అర లీటర్ నీళ్లు.. సెల్ నెట్ వర్క్ లేకుండా దట్టమైన అడవిలో నాలుగు రోజులు ఉన్న శరణ్య కథ ఆసక్తిగా మారింది.