
మన అనుకున్న బంధాలన్నీ
నామ రూపాల నీడలై
ఇసుక రేణువుల్లా జారిపోతాయి
కాలం అనే అగాథంలో
మనసు కట్టుకున్న పాశాలు
నిజమని నమ్మిన రంగులూ
ఏదో ఒక నాటికి తెరలు తొలగిన
నాటకాలై నిశ్శబ్దంగా కూలిపోతాయి
మనం పలకరించిన ముఖాలు
మనదనుకున్న బంధాలు కూడా
నశ్వరమని తెలిసిన క్షణం రేపటికి
అతిథులై మారతాయి
మన జీవన గృహంలో
ఏమీ లేని ఈ ఖాళీ లోకంలో
ప్రశ్నలే మిగులుతాయి
ఈ ప్రయాణంలో మనతో పాటు
నడిచింది ఎవరు?
మన అడుగులకు తోడైనది ఏమిటి?
పదవులు కాదు, పేర్ల నీడలు కాదు
అనుబంధాల పాశాలు కూడా కాదు
మన శ్వాస వెంట నడిచే మన అంతర్ముఖ స్వరం ఒక్కటే
అహం కరుగుతున్న వేళ
గతం అనే మృగ జలం
మన చూపునే మోసం చేస్తుంది
నిజం మాత్రం
మౌనంగా నిలుస్తుంది
అందుకే, వదలడం తెలిసినవారే
తమలో తాము తేలిపోతారు
తమని తాము దాటి
ఉన్నదానిలోనే నిలిచిపోతారు
ఆ ఉనికే మనం
అదే నిత్య సత్యం, అదే మోక్ష మార్గం
– గీతా శ్రీనివాస్