
పెళ్లి, విడాకులు. రెండు భిన్నమైన సందర్భాలు. పెళ్లి అంటే బాజాలు, భజంత్రీలు, ఆనందాలు. కానీ విడాకులు తీసుకుంటే, ఇవేమీ ఉండవు. పెళ్లి తర్వాతి జీవితం కన్నీళ్లు మిగిల్చితే, విడాకులు తీసుకోవడం సంతోషమే ఇస్తుంది. అందుకే ఒక న్యాయమూర్తి తన కూతురి విడాకులను పండగలా చేశాడు. ఉత్తరప్రదేశ్ (యూపీ) లోని మీరట్‌కు చెందిన రిటైర్డ్ జడ్జ్ జ్ఞానేంద్ర శర్మ తన కూతురు ప్రణీత విడాకులు పొందగానే, కోర్టు బయట సందడి చేశారు.
ఢోల్, నగాడా చప్పుళ్లతో ఇంటికి తీసుకెళుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి, చర్చనీయాంశంగా మారాయి. అంతేగాదు, కోర్టు బయట అందరికీ లడ్డూలు పంచారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు ధరించిన టీషర్ట్‌లు కూడా హైలైట్ అవుతున్నాయి. ఐ లవ్ మై డాటర్, మై హార్ట్, మై సోల్ అని రాసి ఉన్న టీ షర్ట్‌లు ధరించారు. అటు విడాకులు తీసుకున్న ప్రణీత కూడా “మై ఫ్యామిలీ, మై లైఫ్” అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించారు.
విడాకులు తీసుకోవడం తనకు సరదా కాదన్నారు ప్రణీత. తాను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, విడాకుల దాకా వ్యవహారం పోకుండా ఉండటానికి ప్రయత్నించానని చెప్పారామె. కానీ పరిస్థితులు మాత్రం విడాకులకు దారి తీశాయనీ, 2021లో ఈ ప్రక్రియ మొదలైందని చెప్పారు..
వీడియో చూడండి..
అటు ఆమె తండ్రి, రిటైర్డ్ న్యాయమూర్తి జ్ఞానేంద్ర శర్మ కూడా తన కూతురికి అండగా నిలిచారు. తన బిడ్డ పుట్టినపుడు ఢోలక్ వాయించామనీ, మళ్లీ ఇప్పుడు అలాగే ఢోలక్ వాయించామనీ చెప్పారు.. తన బిడ్డ ఏ దశలో ఉన్నా, ఆమెకు తాము ఇస్తున్న విలువ మారదని చెప్పడానికి ఇలా ఢోలక్ వాయిస్తున్నట్లు జస్టిస్ జ్ఞానేంద్ర శర్మ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..