Reading Time: < 1 minute

లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను ప్రియుడితో భార్య చంపించింది. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. టాటూ నిందితులను పట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆగ్రాలోని లోకేంద్ర అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. లోకేంద్ర భార్య మహేశ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం లోకేంద్రకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. భర్తను అడ్డుతొలగించుకుంటే వివాహేతర సంబంధం కొనసాగించొచ్చని ప్రియుడితో భార్య ప్లాన్ వేసింది. ఏప్రిల్ 1 సాయంత్రం లోకేంద్ర బయటకు వెళ్లాడు. ఈ విషయం తన ప్రియుడు మహేశ్‌కు తెలిపింది. మార్గం మధ్యలో లోకేంద్రకు మహేష్ కలవడంతో మద్యం తాగుదాముని ఆఫర్ ఇచ్చాడు. మహేష్, లోకేంద్ర, మహేశ్ స్నేహితుడు ధరమ్ వీర్ తో ఫుల్‌గా మద్యం తాగారు. లోకేంద్ర మద్యం పుల్‌గా తాగి పడిపోవడంతో ఇద్దరు కలిసి అతడి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతదేహానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేశారు. కాలిపోయిన మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకేంద్ర సోదరుడు తన అన్న కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం రావడంతో మృతదేహాన్ని లోకేంద్ర సోదరుడుకి చూపించారు. చేతిపై లోకేంద్ర టాటూ ఉండడంతో వెంటనే తమ్ముడు అన్నమృతదేహాన్ని గుర్తు పట్టాడు. లోకేంద్ర భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.