Reading Time: 1 minute
Telangana: ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్.. తెలంగాణ ప్రభుత్వం భారీ ప్లాన్..

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యంత ముఖ్యమైన గోల్డెన్ అవర్‌లోనే మెరుగైన చికిత్స అందించాలనే లక్ష్యంతో స్టేట్ ట్రామా కేర్ పాలసీని రూపొందిస్తోంది. త్వరలో ఈ పాలసీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పాలసీ ద్వారా యాక్సిడెంట్ స్పాట్ నుంచి పెద్ద హాస్పిటల్ వరకు ఒక పక్కా నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. బాధితుడి పరిస్థితిని బట్టి తగిన స్థాయిలో చికిత్స అందేలా నాలుగు లెవెల్‌లుగా వ్యవస్థను డిజైన్ చేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స ఆలస్యం కాకుండా ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ఫోర్ లెవెల్ చైన్ సిస్టమ్‌లో చివరి స్థాయిలో 108 అంబులెన్స్ మొదటి రెస్పాండర్‌గా పనిచేస్తుంది. ప్రమాద స్థలానికి చేరుకుని వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, దగ్గరలోని ట్రామా సెంటర్‌కు తరలిస్తుంది. ప్రతి ట్రామా సెంటర్‌కు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేయనున్నారు. తదుపరి స్థాయిలో జిల్లా హాస్పిటల్స్‌లో ట్రామా కేర్ సెంటర్ల ద్వారా చికిత్స అందుతుంది.

జనరల్ హాస్పిటల్స్‌లో మేజర్ సర్జరీలు

ఇంకా తీవ్రమైన కేసులను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్‌కు తరలించి మేజర్ సర్జరీలు చేస్తారు. అత్యంత విషమంగా ఉన్న కేసులను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, త్వరలో ప్రారంభమయ్యే టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు తరలించి అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ అందించనున్నారు. వరంగల్‌లోని ఎంజీఎం కూడా ఈ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించనుంది. హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు 108 మరియు ఆరోగ్యశ్రీ సంస్థలు కలిసి సర్వే నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా 911 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. ఈ ఆధారంగా 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా నెట్‌వర్క్ రూపొందిస్తున్నారు.

రూ.5.3 కోట్లతో నిర్మాణం

ఒక్కో సెంటర్‌ను సుమారు రూ.5.3 కోట్లతో నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించనుంది. హైవేలపై ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుని, బాధితుడి పరిస్థితిని బట్టి తదుపరి స్థాయి హాస్పిటల్‌కు తరలించే విధంగా ఈ మొత్తం వ్యవస్థ చైన్ మోడల్‌లో పనిచేయనుంది. దీంతో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి ప్రాణాలను కాపాడటం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.