
తుపాకీ తూటాలతో పనిలేదు
ఉండుండీ యుద్ధ మేఘాలు ఆవరిస్తాయి
ముందస్తు హెచ్ఛరికలు లేకుండానే
నలువైపులా చుట్టుముట్టి
అప్పటికప్పుడు మాటలు మందుపాతరలై
ఇద్దరి మధ్యా పెద్ద విస్పోటనం సృష్టిస్తాయి
ఆమె పిల్లలను, పిల్లులను
రక్షణ కవచకం చేసుకొని
ఎదురు కాల్పులకు తెగబడుతుంది
గాయాలన్నీ మాయమై
చెల్లాచెదరైన శరీర అవయవాలన్నీ
ఒక్కటై జరాసందుడిలా
అసలు ఆకారం తీసుకుంటాము
రోజువారీ దాంపత్యం కథలో
ప్రతిష్టంభన ఏర్పడినప్పుడల్లా
ఒక పిట్ట కథ లొట్టలేసుకుంటూ వచ్చి
పీటముడిని సుతారంగా విప్పుతుంది
అత్త మీది కోపం దుత్త మీద
చూపిస్తానని బెదిరిస్తుంది
ఒక ఇంట్లో
రెండు శిబిరాలుగా విడిపోయే వేళ
ఇరువురి మధ్య కాల్పుల విరమణ
ఒడంబడిక జరుగుతుంది
మాటల తూటాల జడివాన వెలిశాక
పాలు పటువను నేలపాలు కాకుండా
కడు నేర్పుతో వ్యూహం పన్నుతుంది
కళింగ యుద్ధం తరువాత
మారిన అశోకుడిలా
అహింస బౌద్ధ ఆరామ ధర్మశాలగా
ఒంటి చేత్తో ఇంటి లోపల
శాంతి కపోతాన్ని ఎగురవేస్తుంది
-జూకంటి జగన్నాధం