Reading Time: 2 minutes

 కోహినూర్ గ్రూప్ వివరణ –

మన తెలంగాణ / హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ భూముల వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని, ఇందులో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కోహినూర్ గ్రూప్‌ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మాణం జరిగిందని వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసం బిఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని కోహినూర్ గ్రూప్ పేర్కొంది. 2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివ్ రాజ్ బహదూర్ వారసులు హక్కుదారులుగా గుర్తించబడ్డారని వెల్లడించింది. 2015 వరకు భూవివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్ రిఫామ్స్ చట్టం వర్తించదని పేర్కొంది. వ్యవసాయానికి అనుకూలం కాని భూమి కావడం, ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫామ్స్ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదని పేర్కొంది. ఎక్యూ స్కేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2021లో మొత్తం స్థలాం చుట్టూ రేకులతో ప్రహరీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్‌సైట్‌లోని టైమ్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. ఈ ప్రహరీ పనులు 2022మే నెలలో పూర్తయ్యాయని తెలిపింది. ఎక్యూ స్క్వేర్ రియల్టర్స్, దాని అనుబంధ సంస్థ క్రిస్టల్ మ్యాన్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో 2021 డిసెంబర్ 6 నుంచి 2023 మార్చి 1వరకు పొంగులేటి హర్ష రెడ్డి అదనపు డైరెక్టర్‌గా ఉన్నారని, అనంతరం బోర్డు నుంచి రాజీనామా చేశారని తెలిపింది. ఆ వివరాలు ఎంసిఎ రికార్డుల్లో నమోదయ్యాయని వివరించింది.

నాదర్గుల్ భూ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ప్రేరేపితంగానే నిరాధార ఆరోపణలు చేస్తూ పొంగులేటికి హర్ష రెడ్డికి ఆపాదిస్తున్నారని పేర్కొంది. ఈ భూమి అసలు రాజా శివ్ రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తి అని, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించబడిందని తెలిపింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో ఓస్ నెంబర్ 155తో ప్రారంభమైందని తెలిపింది. యాజమాన్యం, ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, అయితే ఏప్రిల్ 30, 2007న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసిందని తెలిపింది. దీనిపై హైకోర్టులో ఎస్ నంబర్ 274/2007 ద్వారా అప్పీల్ దాఖలైందని, డివిజన్ బెంచ్‌లో భిన్నాభిప్రాయాల కారణంగా కేసు మూడో న్యాయమూర్తికి వెళ్లిందని వివరించింది. 19 డిసెంబర్ 2011న వెలువడిన తీర్పులో పిటిషనర్లను పూర్తి యజమానులుగా కోర్టు గుర్తించిందని,

రాష్ట్రం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజంక్షన్ కూడా మంజూరు చేసిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎపిఐఐసి 2013లో దాఖలు చేసిన సివిల్ అప్పీలు (2963, 2964)ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, భూ యజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చిందని తెలిపింది. భూమి విస్తీర్ణం అధికంగా ఉండటంతో ల్యాండ్ రిఫారమ్స్ చట్టం వర్తించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు, 2015 వరకు భూమి వివాదంలో ఉండటంతో ఆ చట్టం అమలు కాదని తెలిపింది. 2020 జనవరి 9న ల్యాండ్ రిఫారమ్స్ ట్రైబ్యునల్ (ఎల్‌ఆర్‌టి) నోటీసులు జారీ చేసిందని, దీనిపై భూయజమానులు అప్పీల్ దాఖలు చేయగా అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి పాట్ ఖరాబ్‌గా (అంటే వ్యవసాయానికి అనుకూలం కాని భూమిగా) వర్గీకరించబడిందని కోహినూర్ గ్రూప్ వివరణ ఇచ్చింది. ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫారమ్స్ చట్టం వర్తించదని, ఈ భూమిపై కొందరు చేసిన కొనుగోళ్లలో న్యాయపరమైన లోపాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించింది. నాలా కన్వర్షన్ అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కోహిర్‌నూర్ గ్రూపు పేర్కొంది.