Reading Time: < 1 minute
Lpg Shortage Government Boosts Supply Of 5kg Ftl Cylinders Across India

LPG Shortage: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

దేశంలో ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోగ్రాముల చిన్న సిలిండర్ల (ఎఫ్‌టీఎల్ సిలిండర్లు) సరఫరాను వేగవంతం చేసింది. సాధారణంగా అందించే 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లకు భిన్నంగా, ఈ చిన్న సిలిండర్లు మార్కెట్ ధరలకు అందుబాటులో ఉంటాయి. వీటిని సమీప గ్యాస్ ఏజెన్సీల వద్ద నేరుగా కౌంటర్‌లో పొందవచ్చు. ఈ చిన్న సిలిండర్లకు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోంది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 6.6 లక్షల సిలిండర్లు విక్రయమైనట్లు పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎల్పీజీ కొరత సమయంలో ఈ సిలిండర్లు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా, ఈ ఎఫ్‌టీఎల్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి చిరునామా రుజువు అవసరం లేదు.. కేవలం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID ప్రూఫ్) చూపిస్తే సరిపోతుంది. దీంతో ఎవరైనా సులభంగా ఈ సిలిండర్లను పొందవచ్చు. ఇక, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. భయాందోళనలతో అధికంగా కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరింది. అలాగే బ్లాక్ మార్కెటింగ్, నిల్వలపై కఠిన తనిఖీలు నిర్వహిస్తూ, 3,700కు పైగా దాడులు చేసి, దాదాపు 1,000 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు 36 మంది డీలర్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.

మరోవైపు, దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ అవసరాలు, రవాణా రంగాలకు సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపింది. రాబోయే రోజుల్లో LNG సరఫరా పెరగడంతో పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తానికి, ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నాయి.