Reading Time: 2 minutes

ఆపరేషన్ ఈగిల్ క్లా గుర్తుందా! ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కౌంటర్

Caption of Image.
  •  
  • 1980 లో అమెరికా ఓటమిని గుర్తుచేసిన టెహ్రాన్
  • నాడు ఎడారిలో.. నేడు ఇస్ఫహాన్​లో అదే వైఫల్యమని ఎద్దేవా
  • 2 విమానాలు, 2 హెలికాప్టర్లు బూడిదయ్యాయి: ఐఆర్​జీసీ

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్​కు ఇరాన్ అత్యంత శక్తిమంతమైన చారిత్రక హెచ్చరికతో బదులిచ్చింది. 1980 నాటి ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పరాజయాన్ని గుర్తు చేసింది. నాడు అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని రక్షించేందుకు వచ్చి ఇరాన్ ఎడారిలో అమెరికా సైన్యం ఎలాగైతే ఘోరంగా విఫలమైందో, ఇప్పుడు కూడా అదే పునరావృతమైందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ‘చరిత్ర పునరావృతమవుతుంది’ అని పేర్కొంటూ, ఆనాడు కూలిపోయిన అమెరికా విమాన శకలాల ఫొటోలను ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో పంచుకుంది. దక్షిణ ఇస్ఫహాన్‌‌‌‌లోని పాడుబడిన విమానాశ్రయం వద్ద అమెరికా చేపట్టిన ఈ తాజా రెస్క్యూ మిషన్ కూడా తమ దళాల రాకతో పూర్తిగా విఫలమైందని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. అమెరికా చర్యలను సమర్థిస్తున్న వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లెవిట్‌‌‌‌కు కూడా ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు మద్దతు ఇవ్వడం, పాఠశాలలు, ఆసుపత్రులపై దాడులు చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ‘వీటి గురించి కూడా మీరు గర్వపడతారా?’ అంటూ ఇరాన్ రాయబార కార్యాలయం సూటిగా ప్రశ్నించింది. అమెరికా పైలట్‌‌‌‌ను రెస్క్యూ చేసిన విషయాన్ని ఇరాన్ పూర్తిగా ఖండించనప్పటికీ, ఆ ప్రక్రియలో అమెరికాకు చెందిన పలు విమానాలను, హెలికాప్టర్లను తాము ధ్వంసం చేశామని ఆధారాలతో సహా వెల్లడించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ టెహ్రాన్‌‌‌‌లో సాధారణ ప్రజలు ట్రంప్ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. నగరంలోని పార్కులలో యువత విహారయాత్రలు చేస్తూ, సంగీతం వింటూ వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉన్నారని అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.

రెస్క్యూకు వచ్చిన విమానాలను కూల్చేశాం..

యుద్ధ విమానం పైలట్​ను రక్షించేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైందని ఐఆర్​జీసీ ప్రకటించింది. దక్షిణ ఇస్ఫహాన్ పరిధిలోకి ఎంటరైన అమెరికా మిలటరీ రవాణా విమానాలు రెండు  సి-130, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసినట్లు పేర్కొంది.

అమెరికాకు భారీ నష్టం..

ఈ ఉత్కంఠభరిత పోరులో అమెరికాకు చెందిన రెండు సి-130 భారీ రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను తమ రక్షణ దళాలు ధ్వంసం చేశాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన దృశ్యాల్లో ఎడారి ప్రాంతంలో కాలిపోయిన విమాన శకలాలు, వాటి నుంచి వస్తున్న దట్టమైన పొగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో జరిగిన దాడుల్లో కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తమ అధికారి క్షేమంగా ఉన్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఇరాన్ విమర్శించింది.
 

©️ VIL Media Pvt Ltd.