Reading Time: < 1 minute
Israeli Attack On Trehan Residences 13 Dead

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయి. తాజాగా సోమవారం తెల్లవారుజమున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని నివాసాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది చనిపోయారు. పేలుళ్ల తర్వాత పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు చెప్పారు.

ఇక ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌కు ట్రంప్ 48 గంటలు డెడ్‌లైన్ విధించారు. ఆ సమయం దగ్గర పడుతోంది. నేటితో ఆ గడువు ముగుస్తుంది. ఒకవేళ గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే మంగళవారం నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధ చరిత్రలో మునుపెన్నడూ చూడని చర్య చూస్తారని హెచ్చరించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు పెద్ద ఎత్తున దాడి జరగబోతుందని వార్నింగ్ ఇచ్చారు.

అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ లెక్క చేయడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌కు తమ ప్రతాపం చూపిస్తామని ఎదురు కౌంటర్ ఇస్తోంది. హార్ముజ్ జలసంధిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మునుపటిలాంటి పరిస్థితులు ఇకపై ఉండబోవని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తులు చివరి ప్రయత్నంగా 45 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ఎలాంటి స్పందన రాలేదు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలు హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.

ఇది కూడా చదవండి: Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!