Reading Time: < 1 minute
దేశంలో LPG కొరత? షాకింగ్‌ నిజాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం!

దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఉందనే ప్రచారాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజా అప్‌డేట్‌లో దేశవ్యాప్తంగా ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న ఒక్కరోజులోనే 51 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్లను పంపిణీ చేయడం ద్వారా సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఎల్పీజీ బుకింగ్‌లు 95 శాతానికి చేరుకున్నాయి. సరఫరా పారదర్శకత కోసం డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) విధానాన్ని విస్తృతంగా అమలు చేశారు. ఫిబ్రవరిలో 53 శాతం మాత్రమే ఉన్న DAC ఆధారిత డెలివరీలు ఇప్పుడు 90 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది పంపిణీదారుల స్థాయిలో దారి మళ్లింపును తగ్గించడంలో సహాయపడుతోందని అధికారులు పేర్కొన్నారు.

రోజువారీ సరఫరా విషయంలో కూడా స్థిరత్వం కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 5 కిలోల చిన్న సిలిండర్ల అమ్మకాలు 90 వేల మార్కును దాటాయి. మార్చి 23 నుంచి ఇప్పటివరకు మొత్తం 6.6 లక్షల చిన్న సిలిండర్లు విక్రయించబడ్డాయి. ఈ సిలిండర్లు సమీప పంపిణీ కేంద్రాల్లో అందుబాటులో ఉండగా, ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా చేసే PNG విస్తరణ కూడా వేగం పుంజుకుంది. మార్చి నుంచి 3.6 లక్షల కనెక్షన్లు గ్యాసిఫై చేయగా, 3.9 లక్షలకు పైగా కొత్త రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కొత్త కనెక్షన్ల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేశారు.

దేశీయ అవసరాలను తీర్చేందుకు రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు. తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కేంద్రం సూచించింది. అవసరం లేనిదే ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసుకోవద్దని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బుకింగ్‌లు చేసుకోవాలని కోరింది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వబడుతోందని ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి