Reading Time: < 1 minute

దమ్ముంటే నేరుగా పోరాడండి ..బీజేపీపై మమత ఫైర్

Caption of Image.
  •  
  •     ఓటరు జాబితా నుంచి దొడ్డిదారిలో పేర్లు తొలగిస్తరా?
  •     బీజేపీపై విరుచుకుపడ్డ మమత
  •     ఓట్లు తొలగించిన బీజేపీకి బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపు

కోల్​కతా: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లను తొలగించడం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉన్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘మీకు దమ్ముంటే నేరుగా పోరాడండి, ఇలా దొడ్డిదారిలో పేర్లు తొలగించడం ఏంటి?’’ అని సవాల్ చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాతోనే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని ఆమె నిలదీశారు. ఆదివారం ముర్షిదాబాద్ జిల్లాలోని శంషేర్​గంజ్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు నిరసనగా.. ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు టీఎంసీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

ఈవీఎంలు మొరాయించే అవకాశం

కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించే అవకాశం ఉందని, వాటిని రిపేర్ చేయడానికి అనుమతించకుండా, కొత్త మెషీన్లనే డిమాండ్ చేయాలని పార్టీ శ్రేణులకు మమతా బెనర్జీ సూచించారు. బూత్ ఏజెంట్లు ఎవరూ బీజేపీకి అమ్ముడుపోవద్దని, బెంగాల్ ప్రయోజనాల కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.  ముస్లింలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ (సవరణ) చట్టంపై జరిగిన ఆందోళనలను మమత ప్రస్తావించారు. తన పాలనలో మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ యువతకు ఐఏఎస్, ఐపీఎస్​లాంటి ఉన్నత ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు లభించాయని ఆమె పేర్కొన్నారు. టీఎంసీ తిరిగి అధికారంలోకి వస్తే ‘లక్ష్మీర్ భండార్’ పథకం ద్వారా మహిళలకు జీవితకాల ఆర్థిక సాయం అందుతుందని, నిరుద్యోగ యువతకు ‘బంగ్లార్ యువ సాథి’ కింద నెలకు రూ. 1,500 ఇస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్లో ఎన్ఆర్సీనిగానీ, నిర్బంధ శిబిరాలను గానీ అనుమతించబోమని స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.