Reading Time: < 1 minute

అమరావతి: వర్షపు నీటి విలువ రాయలసీమ రైతులకు బాగా తెలుసని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని, రాయితీతో పరికరాలు ఇచ్చామని అన్నారు. సాగునీటి సంఘాలకు వంద రోజుల ప్రణాళిక ఇచ్చేలా సిఎం దిశానిర్దేశం చేశారు. సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండలం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని, మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని తెలియజేశారు. నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని, భూమినే ఒక జలశయంగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. గతంలోనే ఇంకుడుగుంతలు, పంటకుంటలు తవ్వించామని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు- ప్రగతి తీసుకొచ్చామని అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలని..నడిచే నీటిని మళ్లించాలని, రాయలసీమలో 63శాతం పంటలకు మైక్రో ఇరిగేషన్, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ గా తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు.

హార్టీ కల్చర్ కు వచ్చే ఆరేళ్ల లో రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తామని, రాయలసీమలోని 20 వేల చెరువులు పూర్తిగా నింపామని, భూగర్భ జలాలు పెంచామని.. ఇంకా పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకొచ్చామని, నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. రాయలసీమలో సాగునీటి కోసం కొట్లాటలు ఉండేవని, అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని అన్నారు. భూగర్భ జలాలు పెరిగితే కరెంట్ ఖర్చులు కూడా తగ్గుతాయని, శ్రీశైలం, మల్యాలలో పంపులు పెట్టి నీరు తెస్తున్నామని అన్నారు. యాడికి మండలాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసే బాధ్యత తమదని, ఈ ఏడాది 70 టిఎంసిల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకువచ్చామని అన్నారు. నీరు సమృద్ధిగా ఉంటేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని, దేశంలో ఎక్కువ పళ్లు, కూరగాయలు పండే జిల్లాగా అనంతపురాన్ని మారుస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.