
- హనుమకొండ జిల్లా తక్కళ్లపాడులో వెల్డర్ వినూత్న ప్రయోగం
- ఆయిల్, బ్యాటరీ, కరెంట్‌తో నడిచే ‘మల్టీ స్టవ్’ తయారీ
హనుమకొండ/ఆత్మకూరు, వెలుగు: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ బుక్ చేసినా రోజుల తరబ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర షాపులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తక్కళ్లపాడుకు చెందిన కడారి మల్లేశ్ వినూత్నంగా ఆలోచించాడు.
వెల్డింగ్ తో పాటు ట్రాక్టర్ రోటవేటర్ రిపేర్ చేసే మల్లేశ్.. వాటి నుంచి తీసిన ఆయిల్ ను స్టవ్ కు వినియోగించాలని ప్లాన్ చేశాడు. చదివింది ఏడో తరగతే అయినా ప్రత్యేకంగా మల్టీ స్టవ్ తయారుచేశాడు. లీటర్ కెపాసిటీ కలిగిన ట్యాంక్, బ్యాటరీ, బ్లోయర్, బర్నర్, హీటింగ్ ఎలిమెంట్ ను స్టవ్ కు అమర్చాడు. అనంతరం అందులో ఇంజిన్ ఆయిల్ పోసి బ్లోయర్ ద్వారా బర్నర్ కు మంట వచ్చేలా ఏర్పాటు చేశాడు.
అంతేకాకుండా ఆయిల్ ను ఆఫ్ చేస్తే బ్యాటరీ ద్వారా నడిచేలా, బ్యాటరీ నడవకపోతే కరెంట్ ద్వారా పని చేసేలా హీటింగ్ ఎలిమెంట్ పెట్టాడు. రూ.3 వేల ఖర్చుతో తన ప్రయోగాన్ని సక్సెస్ చేసి మల్టీ స్టవ్ పై వంటలు వండేలా ఏర్పాట్లు చేసి ఔరా అనిపిస్తున్నాడు. దీంతో మల్లేశ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా చిన్న స్టవ్ పై 30 కిలోలు, పెద్ద స్టవ్ పై 50 కిలోల వరకు వంట తయారు చేయవచ్చని మల్లేశ్ చెబుతున్నాడు. ఆర్డర్ ఇస్తే ఎన్ని స్టవ్ లైనా తయారు చేసి ఇస్తానని అంటున్నాడు