
నిజామాబాద్/సిరికొండ/హుస్నాబాద్/కోనరావుపేట/వేములవాడ, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడడంతో వరి, మొక్కజొన్న, మామిడితో పాటు పలు రకాల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, సాలూర, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల కారణంగా 6,088 ఎకరాల పంటకు నష్టం కలిగింది.
ఇందులో 5,065 వరి, 826 ఎకరాల మొక్కజొన్న, 138 ఎకరాల మామిడి, 10 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్‌లో ఆరబోసిన వరి వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే నీటి పాలవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వాన కారణంగా సుమారు 130 మంది రైతులకు చెందిన 200 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగు పడడంతో ఉల్లెందుల రఘుపతికి చెందిన రెండు గేదెలు చనిపోయాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో భారీ వర్షం పడడంతో రోడ్డుకు ఇరువైపులా చెట్లు నేలకొరిగాయి.