Reading Time: < 1 minute

ఐటీ కారిడార్లో డీసీఎం బీభత్సం..స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Caption of Image.
  • స్కూటీపై వెళ్తున్న భార్య మృతి, భర్తకు గాయాలు

మాదాపూర్, వెలుగు: హైదరాబాద్​లోని ఐటీ కారిడార్​లో శనివారం అర్ధరాత్రి ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టి, స్కూటీని ఐదు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలు అయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ బాసిత్(26), హానియా అయేషా(22)  2025 నవంబర్​లో పెండ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్​ వచ్చి మహేశ్వరంలోని మైత్రి కుటీర్​లో నివాసం ఉంటున్నారు. 

బాసిత్.. మలబార్ గోల్డ్​లో ఎక్స్​పోర్ట్ ఇన్​చార్జ్​గా పనిచేస్తున్నాడు.  శనివారం రాత్రి బాసిత్ భార్య అయేషా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కూకట్​పల్లి వై జంక్షన్ సమీపంలోని లేక్‌‌‌‌షోర్ మాల్‌‌‌‌లో సినిమా చూసి, అర్ధరాత్రి రెండు స్కూటీలపై ఇంటికి బయల్దేరారు. మైండ్‌‌‌‌స్పేస్ గేట్‌‌‌‌ ముందు ఉన్న అండర్‌‌‌‌పాస్ వద్దకు రాగానే బాసిత్ స్కూటీని వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన డీసీఎం లారీ (KA05AL6042) ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ డీసీఎం కిందకు వెళ్లింది. డీసీఎం డ్రైవర్ స్కూటీని అలానే మైండ్ స్పేస్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ఐదు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు. స్థానికులు వెంబడించి డీసీఎం ను ఆపడంతో.. డ్రైవర్ దిగి పారిపోయాడు. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న బాసిత్ భార్య హానియా తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. బాసిత్​కు కూడా గాయాలయ్యాయి. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.