Reading Time: 2 minutes

కాంగ్రెస్‌ను అధికారంలోకి

తేవడానికి 2023లో పాదయాత్ర

నేడు బోథ్ నియోజకవర్గంలోని

పిప్పిరిలో బహిరంగ సభ హాజరు

కానున్న సిఎం రేవంత్ పలు

పథకాల లబ్దిదారులకు పత్రాల పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి వేదికగా పీపుల్స్ మార్చ్ పేరిట అప్పటి ప్రధాన ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తికానున్న సందర్భంగా పిప్పిరి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు సిఎం రేవంత్ రెడ్డి హాజరై పాదయాత్రలో ఇచ్చిన సంక్షేమ పథకాల తాలుకా అర్హులయిన లబ్దిదారులకు పత్రాలు అందించనున్నారు.

109 రోజులు.. 1,364 కిలోమీటర్లు

భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమయి 2023 జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. మొత్తం 109 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భట్టి విక్రమార్క సుమారు 1,364 కిలోమీటర్లు నడిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తం 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటి ముందుకు సాగింది. ఈ యాత్రలో ఆయన 700 పైగా గ్రామాలను సందర్శించి వందకు పైగా కార్నర్ సమావేశాల్లో హాజరైన అశేష జన వాహిని ఉద్దేశించి ప్రసంగించారు. పాదయాత్రను మరింత ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో అధిష్టానం సూచన తో మంచిర్యాల, షాద్నగర్, ఖమ్మం, మూడు చోట్ల భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను వినడమే కాకుండా అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా హామీల ద్వారా డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క నాడు ప్రజలకు వివరించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పునరంకితం అవుతూ మరోసారి పిప్పిరి గ్రామంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు అమలు చేసే పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. జలయజ్ఞం 2004 కార్యక్రమంలో ఆడ వద్ద కొమరం భీం ప్రాజెక్టులు ప్రారంభమైనప్పటికీ గత పది సంవత్సరాలుగా కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కుడి ఎడమ కాలువలు వెంటనే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటి సిఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా ఉన్న చికుమాను, పులిమడుగు, కుఫ్టీ త్రివేణి సంగమం ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ రకాల అనుమతులను ఈ సందర్భంగా మంజూరు చేయనున్నారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మర్చిపోలేని

మహాయజ్ఞం : భట్టి విక్రమార్క

ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్ల మేర జరిగిన పీపుల్స్ మార్చ్ పాద యాత్ర జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని డిప్యూటి సిఎం భట్టి అన్నారు. తెలంగాణ మట్టి బిడ్డలకు, నాతో నడిచిన అశేష జనవాహినికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ నాడు పాదాలకు బొబ్బలు ఎక్కినా, శరీరం అలసిపోయినా నన్ను ముందుకు నడిపించింది ప్రజల ఆత్మీయత మాత్రమేనని పేర్కొన్నారు.