Reading Time: 2 minutes

భారతీయ కళారంగంలో ఒక ధృవతార.. విధిని ఎదిరించిన కళాకారుడు గుజ్రాల్

Caption of Image.

భారతీయ కళారంగంలో ఒక ధృవతార. బహుముఖ ప్రజ్ఞాశాలి సతీష్ గుజ్రాల్. ఇది (2026) ఆయన శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్​జీఎంఎ)తో పాటు దేశవ్యాప్తంగా ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతున్నాయి.
సతీష్ గుజ్రాల్ జీవితం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆయన వినికిడి శక్తిని కోల్పోయారు. ఆ నిశ్శబ్దం ఆయనలో ఒక గొప్ప అంతర్​ దృష్టిని మేల్కొల్పింది. మాటలకు అందని భావాలను తన కుంచెతో, మట్టితో, ఇటుకలతో పలికించారు.

తొలి అడుగులు

భారత విభజన సమయంలో చూసిన విషాదం ఆయన తొలి చిత్రాల్లో కనిపిస్తుంది. ప్రాణభయంతో వలస వెళ్తున్న ప్రజలు, వారి కళ్లలోని ఆర్తిని ‘మౌర్నింగ్ ఎన్-మాస్’ వంటి చిత్రాల్లో మనం చూడొచ్చు. బాధను కూడా కళాత్మకంగా ఎలా చూపొచ్చో ఆయన నిరూపించారు.

సరికొత్త ప్రయోగాలు

1950ల్లో మెక్సికో వెళ్లిన గుజ్రాల్, అక్కడ ప్రసిద్ధ చిత్రకారులు డియెగో రివెరా, ఫ్రిదా కాలో వంటి వారితో కలిసి పనిచేశారు. అక్కడ నేర్చుకున్న కుడ్య చిత్రాల శైలిని భారత్‌‌కు తీసుకొచ్చారు. కేవలం పెయింటింగ్స్‌‌కే పరిమితం కాకుండా.. శిల్పకళ, గ్రాఫిక్ డిజైనింగ్, వాస్తుశిల్పంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనకు ఆర్కిటెక్చర్‌‌లో (వాస్తుశిల్పం) ఎటువంటి డిగ్రీ లేదు. 

అద్భుత కట్టడం 

ఎటువంటి ఆర్కిటెక్చర్ డిగ్రీ లేకపోయినా, ఢిల్లీలోని ‘బెల్జియం ఎంబసీ’ భవనాన్ని ఆయన అత్యంత అద్భుతంగా రూపొందించారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటుకలతో ఆయన చేసిన ఆ మ్యాజిక్ చూసి ప్రపంచం అబ్బురపడింది.

శతజయంతి వేడుకలు

ఏ సెంచురీ ఇన్ ఫామ్, ఫైర్ అండ్ విజన్ పేరుతో ఢిల్లీలో భారీ ప్రదర్శన జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచారు. ఆయన వాస్తు కళా నైపుణ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, ఇండియా ఆర్ట్ ఫెయిర్ వంటి వేదికలపై ఆయన జీవితంపై పుస్తకాలను, ప్రత్యేక ఇన్‌‌స్టాలేషన్లను ప్రదర్శిస్తున్నారు. సతీష్ గుజ్రాల్ కేవలం ఒక చిత్రకారుడు మాత్రమే కాదు, ఒక దార్శనికుడు. ‘కళ అనేది కేవలం చూడటానికి మాత్రమే కాదు. అనుభవించడానికి..’ అని నమ్మిన మనీషి ఆయన. ఆయన శతజయంతి వేడుకలు నేటి తరం కళాకారులకు ఒక గొప్ప ప్రేరణ. 

పర్సనల్ లైఫ్​

సతీష్ గుజ్రాల్ 1925లో ప్రస్తుత పాకిస్థాన్‌‌లోని జీలమ్‌‌లో జన్మించారు. భారత మాజీ ప్రధానమంత్రి ఐ.కె. గుజ్రాల్ (ఇందర్ కుమార్ గుజ్రాల్) ఈయనకు సొంత అన్నయ్య. 8 ఏళ్ల వయసులో కశ్మీర్‌‌లో ఒక కాలువ దాటుతుండగా ప్రమాదవశాత్తు పడిపోయారు. ఆ దెబ్బ వల్ల ఆయన వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయారు. సుమారు 62 ఏళ్ల పాటు ఆయన ప్రపంచాన్ని కేవలం కళ్లతోనే చూసి అర్థం చేసుకున్నారు.1998లో ‘కోక్లియర్ ఇంప్లాంట్’ సర్జరీ చేయించుకున్న తర్వాతే మళ్లీ వినగలిగారు. ఆయన భార్య కిరణ్ గుజ్రాల్. ఆమె సతీష్ జీవితంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు వినబడకపోయినా ఆమె ఆయన భావాలను అర్థం చేసుకుని ప్రపంచానికి వివరించేవారు. కిరణ్ స్వయంగా ఒక సిరామిక్ కళాకారిణి. వీరిద్దరిది విడదీయలేని బంధం. సతీష్ మరణించిన కొద్ది రోజులకే ఆమె కన్నుమూశారు. 

నెహ్రూ ప్రోత్సాహం

భారత తొలి ప్రధాని జవహర్‌‌లాల్ నెహ్రూతో సతీష్ గుజ్రాల్‌‌కు మంచి పరిచయం ఉండేది. విభజన సమయంలో గుజ్రాల్ గీసిన ఆర్తితో కూడిన చిత్రాలను చూసి నెహ్రూ ఎంతో ప్రభావితులయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించి పైచదువుల కోసం మెక్సికో వెళ్లడానికి నెహ్రూ ప్రభుత్వం స్కాలర్‌‌షిప్ ఇచ్చి ప్రోత్సహించింది. భారత ప్రభుత్వం ఆయనను1999లో దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్‌‌’తో గౌరవించింది. 
 

©️ VIL Media Pvt Ltd.