సాధారణంగా మనం చికెన్ వండుకునేటప్పుడు ముక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ చాలామంది పక్కన పెట్టేసే కోడి కాలేయంలో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా మహిళల శరీర తత్వానికి, వారు ఎదుర్కొనే నెలవారీ సమస్యలకు చికెన్ లివర్ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనతకు చెక్: మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య రక్తహీనత. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల నీరసం, ఆయాసం వంటివి వస్తుంటాయి. చికెన్ లివర్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కల ద్వారా లభించే ఐరన్ కంటే, లివర్ ద్వారా లభించే ఐరన్‌ను మన శరీరం చాలా వేగంగా గ్రహిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత దరిచేరకుండా కాపాడుతుంది.
పీరియడ్స్ సమయంలో నీరసానికి చెక్: రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం కారణంగా చాలామంది మహిళలు తీవ్రమైన అలసట, నీరసానికి గురవుతుంటారు. చికెన్ లివర్‌లో ఉండే విటమిన్ బి12 శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఆ సమయంలో కలిగే మానసిక కల్లోలాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలకు మేలు: గర్భధారణ సమయంలో శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి ఫోలేట్ చాలా అవసరం. చికెన్ లివర్‌లో సహజ సిద్ధమైన ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు తమ డైట్లో మార్పులు చేసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
ఎలా తీసుకోవాలి?: చికెన్ లివర్‌లో ఐరన్, విటమిన్లతో పాటు జింక్ కూడా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ప్రొటీన్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల కండరాల పుష్టికి మేలు చేస్తుంది. అయితే దీనిని ఫ్రై చేయడం కంటే తక్కువ నూనెతో కూరలా వండుకుని తింటే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు పరిమితంగా తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి.




