
CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో నీటి సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నీరు మనందరికీ సర్వస్వం.. దానిని సంరక్షించుకోవడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం” అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత కోసం సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పరిగెత్తే నీటిని నిలబెట్టడం, నిల్వ ఉన్న నీటిని సరైన విధంగా ఉపయోగించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. జలాశయాలు నింపడం, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి పద్ధతులను విస్తృతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. “నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి” వంటి పథకాల ద్వారా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చామని అన్నారు.
అనంతపురం వంటి ఎడారిగా మారిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు గతంలో ఇన్‌పుట్ సబ్సిడీలు అందించామని గుర్తుచేశారు చంద్రబాబు.. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందించామని చెప్పారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌కు రూ.1,031 కోట్ల వ్యయం చేస్తూ దేశంలో ముందంజలో ఉన్నామని వెల్లడించారు. ఈ చర్యల వల్ల రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని, పండ్ల తోటల పెంపులో అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. భూగర్భ జలాల స్థాయి కూడా మెరుగుపడిందని సీఎం పేర్కొన్నారు. గతంలో అనంతపురంలో 13 మీటర్ల లోతులో లభించిన నీరు ఇప్పుడు 11 మీటర్లకే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది ప్రభుత్వ చర్యల ఫలితమని చెప్పారు.
అలాగే శ్రీశైలం నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించి, అక్కడ ఆదా అయిన నీటిని రాయలసీమకు మళ్లించామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల విషయానికొస్తే, గత ప్రభుత్వాలు భారీగా పెంచిన భారం ప్రజలపై వేయకుండా కూటమి ప్రభుత్వం భరిస్తోందని సీఎం తెలిపారు. రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అంతేకాకుండా తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేయడం కూటమి ప్రభుత్వ ఘనతగా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చి, రాష్ట్రాన్ని నీటి విషయంలో స్వయం సమృద్ధిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.