
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్‌తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడతామో చాలా సృజనాత్మ కంగా చూపించారు.
ప్రదీప్ అద్భుతంగా నటించాడు’ అని అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం- అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేది వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన జీవిత భాగస్వామి ఎవరో చెబితే? దానిని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివ మాట్లాడుతూ ‘ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. ప్రదీప్ ఈ స్క్రిప్ట్‌ను నమ్మి చేశాడు. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, కృత్తిశెట్టి, ఎస్‌జె సూర్య, శివప్రసాద్ పాల్గొన్నారు.