
హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ ‘ఇందులో నేను చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా విభిన్నమైనది. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు.
సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర నా కెరీర్ లో గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో రూబారు పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాని శేష్ కోసం థియేటర్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిలమ్స్‌లో ఒకటిగా ఉంటుంది‘ అని అన్నారు.