
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలే బీజేపీకి అసలైన పునాదులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. కాశ్మీర్ కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన పోరాటం, బలిదానాన్ని ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని, ఆ ప్రేరణతోనే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బూత్‌లో, ప్రతి ఇంటిపై కాషాయ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో జెండా ఆవిష్కరణలు ప్రారంభించారని, ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. జాతీయ భావనను, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ వేడుకలు మరింత పెంచుతాయని ధీమా వ్యక్తం చేశారు. వాజ్ పేయి, నరేంద్ర మోదీ హయాంలోనే దేశం నిజమైన అభివృద్ధిని చూస్తోందని పేర్కొన్నారు.