Reading Time: 3 minutes

IPL 2026: షమీ సన్ స్ట్రోక్.. ఉప్పల్‎లో సన్‎రైజర్స్ దెబ్బకొట్టిన లక్నో పేసర్

Caption of Image.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: 7, 0, 1, 14.. ఉప్పల్ స్టేడియం చూడగానే ఊగిపోయే సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్ టాప్‌‌‌‌-4 బ్యాటర్ల స్కోర్లు ఇవి..! సొంతగడ్డపై సింహాల్లా గర్జించే హిట్టర్లు.. లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌ వెటరన్ పేసర్ మహ్మద్ షమీ  (4–0–9–2) ధాటికి పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. పవర్‌‌‌‌ప్లేలో 22/3, పది ఓవర్లకు 35/4 స్కోరుతో కష్టాల్లో పడ్డ జట్టును హెన్రిచ్‌‌‌‌ క్లాసెన్ (41 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 ), నితీష్ కుమార్ రెడ్డి (33  బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) అద్భుత హాఫ్ సెంచరీలతో గట్టెక్కించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 

చిన్న టార్గెట్‌‌‌‌ను కాపాడుకునేందుకు బౌలర్లు శ్రమించినా.. రిషబ్ పంత్ (68 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌‌‌తో చెలరేగడంతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు 5  వికెట్ల తేడాతో లక్నో చేతిలో ఓటమి తప్పలేదు. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 156/9 స్కోరు మాత్రమే చేసింది. షమీతో పాటు ప్రిన్స్‌‌‌‌ యాదవ్ (2/34), అవేశ్ ఖాన్ (2/36) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 160/5 స్కోరు చేసి గెలిచి విజయాల ఖాతా తెరిచింది. ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (27 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) కూడా రాణించాడు. హర్ష్ దూబే (2/18) రెండు వికెట్లు తీశాడు. షమీకి  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

షమీ నిప్పులు..

టాపార్డర్ ఫెయిలవడంతో సన్‌‌‌‌రైజర్స్ తక్కువ స్కోరుకు పరిమితం అయింది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న లక్నో కెప్టెన్ పంత్ నిర్ణయానికి ఆ టీమ్ బౌలర్లు, ముఖ్యంగా షమీ పూర్తి న్యాయం చేశాడు. గత సీజన్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు ఆడిన 35 ఏండ్ల షమీ నిప్పులు చెరిగే బాల్స్‌‌‌‌తో తన మాజీ టీమ్‌‌‌‌మేట్స్‌‌‌‌ను వణించాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా 18 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7)ను వరుస ఓవర్లలో ఔట్ చేసి హైదరాబాద్‌‌‌‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.

 కెప్టెన్ ఇషాన్ కిషన్ (1)ను  నాలుగో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ మ్యాచ్‌‌‌‌కే హైలైట్‌‌‌‌గా నిలిచిన బాల్‌‌‌‌తో క్లీన్‌‌‌‌ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో రైజర్స్ 22/3 స్కోరు మాత్రమే చేసింది.  లియామ్ లివింగ్‌‌‌‌స్టోన్ (14)ను ఎనిమిదో ఓవర్లో దిగ్వేష్ రాఠీ ఔట్ చేయడంతో  రైజర్స్‌‌‌‌ 26/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌కు తోడైన నితీశ్‌‌‌‌ రెడ్డి ఒక్కో పరుగు జత చేస్తూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయడంతో సగం ఓవర్లకు రైజర్స్ 35/4 స్కోరుతో నిలిచింది.
నితీశ్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ మెరుపులు..

అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన నితీశ్‌‌‌‌, క్లాసెన్ 

సెకండాఫ్‌‌‌‌లో జోరు పెంచారు. ప్రిన్స్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో చెరో సిక్స్‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌కు జోష్ తెచ్చారు. దిగ్వేశ్ బౌలింగ్‌‌‌‌లో నితీష్ 4,4 కొట్టాడు. సిద్దార్థ్‌‌‌‌ వేసిన 13వ ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను ముకుల్ డ్రాప్ చేయడంతో దక్కిన లైఫ్‌‌‌‌ను క్లాసెన్ సద్వినియోగం చేసుకున్నాడు. అవేశ్‌‌‌‌ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో నాలుగు ఫోర్లతో తన మార్కు హిట్టింగ్‌‌‌‌ చూపెట్టాడు. దిగ్వేశ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో నితీశ్‌‌‌‌ భారీ షాట్లతో మూడు సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌‌‌‌లో సిక్స్ రాబట్టిన క్లాసెన్ 33 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 30 బాల్స్‌‌‌‌లో ఈ మార్కు దాటిన నితీశ్.. అవేశ్ బౌలింగ్‌‌‌‌లో మరో బాల్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌కు పంపాడు. 

వీళ్ల జోరు చూస్తుంటే రైజర్స్‌‌‌‌ 170 స్కోరు చేసేలా కనిపించింది. కానీ,18వ ఓవర్లో నితీశ్‌‌‌‌ను ఔట్ చేసిన సిద్దార్థ్ ఐదో వికెట్‌‌‌‌కు 116 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు.  క్లాసెన్, నితీశ్‌‌ జోడీ విడిపోయిన తర్వాత సన్‌‌‌‌రైజర్స్ ఇన్నింగ్స్ మళ్ళీ మందగించింది. 19వ ఓవర్లో క్లాసెన్‌‌‌‌, హర్ష్‌‌‌‌ దూబే (0)ను పెవిలియన్ చేర్చిన అవేశ్  రెండు రన్సే ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో శివాంగ్ కుమార్ (5), హర్షల్ పటేల్ (4 నాటౌట్) చెరో ఫోర్‌‌‌‌‌‌‌‌ రాబట్టడంతో హైదరాబాద్  కష్టంగా 150 మార్కు దాటింది. 

గెలిపించిన పంత్

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో లక్నోకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు మార్‌‌‌‌‌‌‌‌క్రమ్, మిచెల్ మార్ష్‌‌‌‌ (14) దూకుడుగా ఆడారు. నితీశ్‌‌ రెడ్డి వేసిన రెండో ఓవర్లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ రెండు, మార్ష్ ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చారు.  ఉనాద్కట్ బౌలింగ్‌‌‌‌లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ సిక్స్‌‌‌‌తో స్పీడు పెంచగా.. ఐదో ఓవర్లో మరో ఫోర్ కొట్టిన మార్ష్‌‌‌‌ను ఈషాన్ మలింగ ఔట్ చేసి ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. కానీ, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ ఏమాత్రం తగ్గలేదు. 

ఉనాద్కట్ వేసిన ఆరో ఓవర్లో 4, 4, 6తోరెచ్చిపోవడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలోనే లక్నో 53/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత రైజర్స్ బౌలర్లు పుంజుకున్నారు. ఫిఫ్టీ దిశగా దూసుకెళ్తున్న మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ను శివాంగ్ ఔట్ చేయగా..  13వ ఓవర్లో ఆయుష్​ బదోనీ (12)ని హర్ష్‌‌‌‌ దూబే స్టంపౌట్ చేశాడు. ఆ వెంటనే నికోలస్ పూరన్ (1)ను కీపర్ ఇషాన్ రనౌట్ చేయడంతో లక్నో105/4తో నిలిచింది. దాంతో  రైజర్స్ శిబిరంలో ఆశలు రేగాయి. పంత్‌‌‌‌, అబ్దుల్ సమద్ (16) చెరో రెండు ఫోర్లతో ఛేజింగ్‌‌‌‌కు మళ్లీ ఊపు తెచ్చారు. 

 చివరి మూడు ఓవర్లలో లక్నోకు 19 రన్స్ అవసరం అయ్యాయి. 18వ ఓవర్లో సమద్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన హర్ష్‌‌‌‌ దూబే 6 రన్సే ఇచ్చి  ఆశలు రేపాడు. పంత్ ఫిఫ్టీ పూర్తి చేసుకొని క్రీజులో ఉన్నా 19వ ఓవర్లో హర్షల్ పటేల్ 4 రన్సే ఇవ్వడంతో మ్యాచ్‌‌‌‌లో టెన్షన్ రేగింది. కానీ కూల్‌‌‌‌గా ఆడిన పంత్ ఉనాద్కట్ వేసిన లాస్ట్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి లక్నోను గెలిపించాడు. 

సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 156/9 (క్లాసెన్ 62, నితీశ్ 56, షమీ 2/9).
లక్నో: 19.5 ఓవర్లలో 160/5 (పంత్ 68 నాటౌట్‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ 45, హర్ష్‌‌‌‌ దూబే 2/18)

35/4 ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌ తొలి సగం  ఓవర్లలో  సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ చేసిన లోయెస్ట్ స్కోరు ఇదే. ఓవరాల్‌‌‌‌గా నాలుగో లోయెస్ట్ స్కోరు.
 

©️ VIL Media Pvt Ltd.