
న్యాయ మౌలిక వసతులు విలాసం కాదు.. అత్యవసరం
కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుంది జడ్జిల
నివాస సముదాయాల్లోనూ కార్యకలాపాలు: సిజెఐ జస్టిస్
సూర్యకాంత్ 2027 డిసెంబర్ నాటికి హైకోర్టు భవన
నిర్మాణ పనులు పూర్తిచేస్తాం ప్రజాస్వామ్యంలో శాసన,
కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం గౌరవంతో
పనిచేయాలి కోర్టు సముదాయం అన్నివర్గాలకు పవిత్ర
ఆలయం లాంటిది: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్2 భవన నిర్మాణ
పనులకు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన
మనతెలంగాణ/హైదరాబాద్ : న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే సంకల్పంతో అడుగులు వేసినప్పుడే రాజ్యాంగం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితంలో సజీవంగా మారుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా, న్యాయ మౌలిక సదుపాయాల కల్పన ఐచ్ఛికం కాదని, అది అత్యవసరమని అన్ని పక్షాల ప్రభుత్వాలు గుర్తించాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హిమాచల్ వరకు, అసోం నుంచి తెలంగాణ వరకు ఇప్పుడు న్యాయవ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. న్యాయ మౌలిక సదుపాయాలు విలాసం కాదు అని, అవి దేశానికి ప్రాణాధారం అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు రెండో జోన్ భవన నిర్మాణ పనులకు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో పాటు ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసే ప్రదేశానికి చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్‌కు సిఎం రేవంత్ రెడ్డి సహా న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిజెఐ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని కొనియాడారు. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ బలోపేతంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం చారిత్రాత్మకమైనదే అయినప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వసతులు లేవని సిజెఐ అభిప్రాయపడ్డారు. కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అనేవి ప్రజలకు విజిబుల్ జ్యుడీషియరీ అని, కోర్టు గది వెనక మరో ప్రపంచం ఉంటుందని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయని, న్యాయమూర్తుల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ.. వచ్చే వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. 100 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ సముదాయం దేశంలోనే అత్యుత్తమంగా నిలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం: సిఎం రేవంత్‌రెడ్డి
హైకోర్టు భవన నిర్మాణ పనులు డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, అది భారత గణతంత్రం ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని పేర్కొన్నారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 2023 డిసెంబర్‌లో తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయం ఒకటి అని పేర్కొన్నారు. అందుకోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని తెలిపారు. భవనాల కోసం జోన్-1లో ఇప్పటికే ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పుడు జోన్-2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ నిర్మించబోయే భవనం దేశంలోనే అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, ఆధునికత, మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం ఆధారపడి, గౌరవంతో పనిచేస్తాయని తెలిపారు.
సాధారణ పౌరుడు న్యాయం కోసం చివరగా ఆశ్రయించేది న్యాయస్థానాన్నే అని, అలాంటి న్యాయస్థానానికి కావలసిన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తానని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే హైకోర్టు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని, ఇది పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వారికి వేదికగా నిలుస్తుందని చెప్పారు. రాబోయే వంద సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారిన వర్గాలు న్యాయం కోసం ఈ మందిరానికి వస్తారని అన్నారు. దేశంలో ఒక దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఒక కోర్టు సముదాయం అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర ఆలయం వంటిదని వ్యాఖ్యానించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవన సముదాయమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు, మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. హైకోర్టు భవన సముదాయం కేవలం నిర్మాణం కాదు.. ఇది తమ ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ పట్ల తమ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.