Reading Time: < 1 minute
Ex Army Man Chains Girl For Plucking Guava

రోజురోజుకు మనుషుల్లో మానవత్వం సన్నగిల్లుతోంది. ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారి ఇంటి ముందు ఉన్న జామ చెట్టు నుంచి కాయ కోసిందని.. ఓ మాజీ సైనికుడు అత్యంత దారుణంగా హింసించి గొలుసులతో బంధించి నరకం చూపించాడు. ఈ దారుణ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఓ చిన్నారి.. మాజీ సైనికుడి ఇంటి ముందు ఉన్న జామ చెట్టు నుంచి ఒక కాయ కోసింది. దీంతో అతడు చిన్నారిని పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి మెట్ల దగ్గర ఉన్న ఇనుప రాడ్డుకు గొలుసులు వేసి బంధించాడు. దీంతో చిన్నారి భయంతో విలవిలలాడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక చిన్నారి అల్లాడిపోయింది. దీన్ని గమనించిన రోహిత్ అనే యువకుడు సాహసం చేసి చిన్నారి దగ్గరకు వెళ్లగా… చేతులెత్తి దండం పెడుతూ తనను రక్షించాలంటూ బిగ్గరగా ఏడుస్తూ మొర్రపెట్టుకుంది. అయితే మాజీ సైనికుడు మాత్రం.. ఆమె జామకాయలు దొంగతనం చేసిందంటూ తన చర్యను సమర్థించుకుంటూ కనిపించాడు. యువకుడు తీసిన వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు.. చైల్డ్ ఆఫీసర్‌కు రోహిత్ ఫోన్ చేయడంతో సంఘటనాస్థలికి చేరుకుని చిన్నారిని గొలుసుల నుంచి విడిపించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత కూరత్వమా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రూ.5 ఖరీదు చేసే జామ కోసం గొలుసులతో బంధిస్తారా? అంటూ మాజీ సైనికుడిపై మండిపడుతున్నారు.