Reading Time: 2 minutes

చిన్న కార్లకు కాలం చెల్లిందా? SUVలపై మనసుపడుతున్న ఇండియన్ మిడిల్‌క్లాస్

Caption of Image.

భారత ఆటోమొబైల్ రంగంలో గత కొన్నేళ్లుగా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు మధ్యతరగతి కలల కారుగా వెలిగిపోయిన హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఇప్పుడు క్రమంగా కళతప్పుతోంది. దీనికి భిన్నంగా రోడ్లపై గంభీరంగా కనిపించే SUVల మార్కెట్‌ భారీగా పెరిగింది. 2026 నాటికి భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 55 శాతం దాటిపోయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అటు సెడాన్లు, ఇటు హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు కలిపినా ఎస్‌యూవీల జోరును అందుకోలేకపోతున్నాయంటే వాటికి ఉన్న ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో చూడొచ్చు.

ఒకప్పుడు కేవలం 25 శాతం మార్కెట్ వాటా ఉన్న ఎస్‌యూవీలు.. ఇప్పుడు భారత మార్కెట్లో సగానికి పైగా ఆక్రమించేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా విడుదలైన వాహనాల్లో 56 శాతం ఎస్‌యూవీలే కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలు మారడమే. రోడ్ల పరిస్థితికి అనుగుణంగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం, కారులో ఎక్కువ స్పేస్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, రోడ్డుపై కారు ఇచ్చే లుక్ కారణంగా యువతతో పాటు ఫ్యామిలీస్ కూడా ఎస్‌యూవీల పైనే మనసు పడుతున్నారు. మరోవైపు మధ్యతరగతికి ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్ వాటా 23 శాతానికి పడిపోయింది.

సెడాన్ల పరిస్థితి చూస్తే.. అవి కొంతమేర నిలకడగా ఉన్నప్పటికీ ఎస్‌యూవీల స్థాయికి చేరుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం సెడాన్ల మార్కెట్ వాటా కేవలం 8.5 శాతంగా ఉంది. అయితే మారుతి సుజుకి డిజైర్ వంటి కొత్త తరం మోడళ్లు కొంతవరకు సెడాన్ అమ్మకాలను నిలబెడుతున్నాయి. 2026 ఫిబ్రవరి నాటి సేల్స్ డేటా ప్రకారం.. టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మైక్రో, కాంపాక్ట్ ఎస్‌యూవీలు అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ముఖ్యంగా టాటా పంచ్ నెలకు 20వేల యూనిట్లకు పైగా అమ్ముడవుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

►ALSO READ | పీకేసిన ఒరాకిల్ ఉద్యోగానికి.. కంపెనీ ఇచ్చే డబ్బులపై ఎంత ట్యాక్స్ వేస్తారో తెలుసా..?

అలాగే మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్ల జాబితాలో టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి బ్రెజా అగ్రస్థానంలో ఉన్నాయి. వీటికి తోడు మారుతి నుంచి వచ్చిన కొత్త మోడల్ విక్టోరిస్, మహీంద్రా స్కార్పియో, కియా సెల్టోస్ వంటి కార్లు కూడా దూసుకుపోతున్నాయి. ఎస్‌యూవీల జోరు కేవలం నగరాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా చిన్న సైజు ఎస్‌యూవీలను (Micro SUVs) తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తుండటంతో, హ్యాచ్‌బ్యాక్ కొనేవారు కూడా కొంచెం ఎక్కువ పెట్టి ఎస్‌యూవీలనే ఎంచుకుంటున్నారు. భారత ఆటో మార్కెట్ ఇప్పుడు పూర్తిగా ‘బిగ్గర్ ఈజ్ బెటర్’ అనే మంత్రం వైపు మళ్లింది.

©️ VIL Media Pvt Ltd.